
న్యూఢిల్లీ: కంపెనీ ఎదుగుదలలో కృషి చేసిన ఉద్యోగులకు ఆ సంస్థ విశేష ప్రోత్సాహకాలు అందించింది. సంస్థ అభివృద్ధిలో స్థిరమైన మద్దతుతో సహకరించిన ఉద్యోగులకు సుమారు 100 కార్లను గిఫ్ట్ ఇచ్చింది. సంస్థ విజయవంతం కావడానికి పదేళ్లుగా నిర్విరామ కృషి చేసిన ఉద్యోగులను ప్రోత్సహించడం, వారి కృషికి తగిన ప్రతిఫలం ఇవ్వడం తమ బాధ్యతగా ఆ కంపెనీ చెప్పింది. చెన్నైలోని ఐడియాస్2ఐటీ అనే ఐటీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
తమతో 10 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ కాలం తమ ప్రయాణంలో కలిసి ఉండి.. కంపెనీ పురోగతికి ఎంతో సహకరించిన 100 మంది ఉద్యోగులకు మారుతి సుజుకీ కార్లను బహూకరించింది. ఐడియాస్2ఐటీ కంపెనీ మార్కెటింగ్ హెడ్ హరి సుబ్రమణియన్ మాట్లాడుతూ, తమతో పాటు పదేళ్లుగా ఈ కంపెనీలో కలిసి ప్రయాణం చేసిన 100 మంది ఉద్యోగులకు ఒక్కో కారు చొప్పున వంద కార్లను బహూకరించామని వివరించారు. తాము పొందిన సంపదను తిరిగి ఉద్యోగులకు చెల్లించడమే తమ విధానం అని తెలిపారు.
ఐడియాస్2ఐటీ కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ మురళి వివేకానందన్ మాట్లాడుతూ, ఈ కంపెనీ అభివృద్ధి చెందడానికి ఉద్యోగులు ఎంతో కష్టపడ్డారని వివరించారు. ఉద్యోగులకు ఈ కంపెనీ కార్లు ఇవ్వడం లేదని, ఉద్యోగులే స్వయంగా కష్టపడి కార్లను పొందారని తెలిపారు.
ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం తాము ఉద్యోగులకు హామీ ఇచ్చామని, భారీ లక్ష్యాలను ఛేదించగానే సంపదను కచ్చితంగా ఉద్యోగులతో పంచుకుంటామని చెప్పామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కారుల పంపిణీ అనేది ఈ హామీలో ఒక మొదటి అడుగు మాత్రమేనని వివరించారు. సమీప భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడుతామని చెప్పారు.
పని చేస్తున్న సంస్థ నుంచి బహుమానాలు పొందడం నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుందని కారు పొందిన ఓ ఉద్యోగి ప్రశాంత్ వివరించారు. ప్రతి వేడుకకు తమ కంపెనీ సంతోషాన్ని పంచుతూ ఉంటుందని తెలిపారు. బంగారు నాణేలు, ఐఫోన్‌లు ఇలా ఏదో ఒక రూపంలో ఉద్యోగులను సంతోషపెడుతుందని అన్నారు. కారు అనేది నిజంగా తమకు పెద్ద విషయం అని పేర్కొన్నారు.
ఇటీవలే ఇదే చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ కంపెనీ కిస్‌ఫ్లో ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఐదు లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లను బహూకరించింది. ఈ కారు ఒక్కోటి రూ. 1 కోటి విలువ కలిగి ఉంటుంది. ఈ బహుమానం సంచలనం రేపింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే అలాంటి విధంగానే ఉద్యోగులకు కార్లను బహూకరించింది.