పంజాబ్: రేపు 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చరణ్‌జిత్ సింగ్

By Siva KodatiFirst Published Sep 19, 2021, 9:04 PM IST
Highlights

పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్నారు. అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో మరో నేతను ఎన్నుకోవడం చకచకా జరిగిపోయాయి. నూతన సీఎం ఎంపికపై కాంగ్రెస్ అందరి అంచనాలను తలకిందులు చేసింది. అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని పంజాబ్ నూతన సీఎంగా ఎన్నుకుంది.

పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్నారు. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ హరీశ్ రావత్‌ వెంట ఆయన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌‌ను రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు. అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయాల్సిందిగా గవర్నర్ చన్నీని ఆహ్వానించారు. 

47ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ట్రెయినింగ్ మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించారు. చాంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన రమదాసియా సిక్కు కమ్యూనిటీకి చెందినవారు. ఈ కమ్యూనిటీ దళిత వర్గంలో భాగం. దీంతో పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ నిలిచారు. కెప్టెన్‌పై తిరుగుబావుటా ఎగరేసినవారిలో చన్నీ కూడా ఉండటం గమనార్హం.

ALso Read:టెంట్‌ బాయ్‌ టు సీఎం: పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ ఎవరో తెలుసా?

చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో 1972 ఏప్రిల్ 2న చాంకౌర్ సాహిబ్ సమీపంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తండ్రి ఎస్ హర్షా సింగ్ మలేషియాకు వెలసవెళ్లాల్సి వచ్చింది. అనంతరం వ్యాపారంలోకి దిగి సక్సెస్ అయ్యారు. మలేషియా నుంచి తిరిగి వచ్చాక ఖరార్ పట్టణంలో సెటిలై టెంట్ హౌజ్ బిజినెస్ పెట్టుకున్నారు. ఇందులో చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా టెంట్ బాయ్‌గా పనిచేశారు.
 

click me!