జాబిల్లిపై సేఫ్ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న చంద్రయాన్-3..ఎల్ హెచ్ డీఏసీ తీసిన తాజా ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

Published : Aug 21, 2023, 10:16 AM IST
జాబిల్లిపై సేఫ్ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న చంద్రయాన్-3..ఎల్ హెచ్ డీఏసీ తీసిన తాజా ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

సారాంశం

చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు చంద్రయాన్ -3 ప్రయత్నిస్తోంది. అందుకే ఉపరితలంపై కొండలు, లోయలు లేని ప్రాంతం కోసం అన్వేషిస్తోంది. మరో రెండు రోజుల్లో జాబిల్లిపై చంద్రయాన్ -3 దిగనుంది.  

చంద్రయాన్-3 జాబిల్లిపై సేఫ్ గా దిగేందుకు ప్రయత్నింస్తోంది. అందుకే చంద్రుడిపై సురక్షిత ప్రాంతాన్ని కనుగొనేందుకు ఉపరితలాన్ని విశ్లేషిస్తోంది. దీని కోసం చంద్రయాన్-3లో మోహరించిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా (ఎల్ హెచ్ డీఏసీ) ద్వారా ఫొటోలు తీస్తోంది. అయితే ఈ ఫొటోలను ఇస్రో తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఇంత క్లారిటీగా ఫొటోలు తీసిన కెమెరాను స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో డెవలప్ చేసినట్టు పేర్కొంది. 

‘‘చంద్రయాన్-3 మిషన్: ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా (ఎల్ హెచ్ డీఏసీ) తీసిన చంద్రుడి సుదూర ప్రాంత చిత్రాలు ఇవి. దిగే సమయంలో బండరాళ్లు లేదా లోతైన కందకాలు లేకుండా సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో సహాయపడే ఈ కెమెరాను ఇస్రో ఎస్ఏసీలో అభివృద్ధి చేసింది’’ అని ఇస్రో ట్వీట్ చేసింది.

2023 ఆగస్టు 23న భారత కాలమానం ప్రకారం 18:04 గంటలకు చంద్రయాన్-3 చంద్రుడి ఉపరితలంపై దిగుతుందని ఇస్రో ఆదివారం అధికారికంగా ధృవీకరించింది. మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగానే వ్యోమనౌక తన అంతిమ లక్ష్యమైన చంద్రుడి దక్షిణ ధృవానికి వేగంగా చేరువవుతోంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా చంద్రుడి ఉపరితలంపై ఖచ్చితమైన, సున్నితమైన ల్యాండింగ్ సాధించే మిషన్ ను ఇస్రో చేపడుతోంది. 

ఎళ్లుండి భారత కాలమాన ప్రకారం 17:27 గంటలకు ప్రారంభమయ్యే చంద్రయాన్ -3 ల్యాండింగ్ ప్రత్యక్ష కవరేజీని ఇస్రో వెబ్ సైట్, దాని యూట్యూబ్ ఛానెల్, ఫేస్ బుక్ , పబ్లిక్ బ్రాడ్కాస్టర్ డీడీ నేషనల్ టీవీతో సహా వివిధ వేదికల ద్వారా అంతరిక్ష ఔత్సాహికులు చూడవచ్చు. కాగా.. చంద్రయాన్ -3 మిషన్ లో గత గురువారం కీలక ఘట్టం చోటు చేసుకుంది. వ్యోమనౌకలోని 'విక్రమ్' ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వైదొలగింది. ఆ తర్వాత ల్యాండర్ కీలక డీబూస్టింగ్ విన్యాసాలు నిర్వహించి కాస్త తక్కువ కక్ష్యలోకి దిగింది. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు