
Chandrayaan 3: భారత అంతరిక్ష సంస్థ( ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా సాప్ట్ ల్యాండింగ్ అయ్యింది. భారతీయ కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం 6:40 గంటలకు చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇస్రోలను అభినందనలతో ముంచెత్తెత్తున్నారు.
మన జీవితం ధన్యం : ప్రధాని నరేంద్ర మోదీ
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయినందుకు ఇస్రో, శాస్త్రవేత్తల టీమ్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఈ క్షణాలు మరపురాని, అపూర్వమైన, శంఖారావంగా అభివర్ణించారు. కళ్ల ముందే చరిత్ర సృష్టించడం చూశామని అన్నారు. ఈ ప్రయోగం మన జీవితాన్ని ధన్యం చేసిందనీ, ఇటువంటి చారిత్రక సంఘటనలు జీవితానికి శాశ్వతమైన చైతన్యాన్ని అందిస్తాయని తెలిపారు.
భారతదేశ సామర్థ్యాలకు నిదర్శనమిది: సీఎం యోగి
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్-3 విజయం నవ భారత శక్తి, సామర్థ్యాలకు నిదర్శనమని అన్నారు. ప్రధాని దార్శనిక నాయకత్వం, మార్గదర్శకత్వంలో ఎవరూ చేయలేని పనిని ఇస్రో శాస్త్రవేత్తలు చేశారని అన్నారు. ఇప్పటి వరకు చంద్రుని దక్షిణ ధృవం అడుగుపెట్టడం అసాధ్యమని.. ఆ సాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తూ.. మన శాస్త్రవేత్తలు మార్గదర్శనం చేశారని అన్నారు. వసుధైవ కుటుంబం పవిత్ర స్ఫూర్తితో, ఈ విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలందరినీ తాను అభినందిస్తున్నాననీ, దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాబోయే తరాలకు స్ఫూర్తి : రాహుల్ గాంధీ
చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో దేశం సంబరాల్లో మునిగిపోయింది. ఈ సంతోషంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి ఆయన ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ ట్విటర్ లో ఇలా రాశారు. "ఈ విజయానికి ఇస్రో బృందానికి అభినందనలు. దక్షిణ ధ్రువంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ మన శాస్త్రవేత్తల అద్భుతమైన ప్రతిభ, దశాబ్దాల కృషి ఫలితం."అని పేర్కొన్నారు. అలాగే.. "1962 నుండి భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమం నూతన శిఖరాలను తాకుతోంది.ఇది రాబోయే తరాలకు స్ఫూర్తినివ్వబోతుంది." అని పేర్కొన్నారు.
మనం మరింత ముందుకు వెళ్లాలి: అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ఇస్రోకు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా అభినందలు తెలుపుతూ.. 'చాంద్ ముబారక్, అబ్ ఔర్ భీ ఆగే జానా హై' అని రాశాడు. దీనితో పాటు ఇస్రో, ఇండియా అని హ్యాష్‌ట్యాగ్ చేశారు.
చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు: సీఎం ఖట్టర్
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చంద్రయాన్-3 మిషన్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. చంద్రుడు ఇప్పుడు మనకు చాలా దగ్గరగా ఉన్నాడని చెప్పాడు. చంద్రునిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. చంద్రయాన్-3 మిషన్‌తో భారత్ చంద్రుడి ఉపరితలంపై తన ఉనికిని చాటుకుందనీ, ఈ సందర్భంగా ఇస్రోకు, శాస్త్రవేత్తలకు నా మద్దతు తెలియజేస్తున్నాను. వాళ్ల వల్లే ఈ విజయం సాధ్యమని పేర్కొన్నారు.
చారిత్రాత్మక ఘట్టం: కేజ్రీవాల్
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని, దేశప్రజలందరూ గర్విస్తున్నారని అన్నారు.
వైఫల్యం నుంచి నేర్చుకుని విజయం సాధించాం: ఇస్రో చీఫ్
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంతో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తన బృందాన్ని అభినందించారు. మిషన్ సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గత వైఫల్యం నుండి చాలా నేర్చుకున్నామనీ, ఈ పాఠాల వల్ల నేడు విజయం సాధించామని తెలిపారు. చంద్రయాన్-3 కోసం మేము ఇప్పటి నుండి 14 రోజులు ఎదురు చూస్తున్నామని అన్నారు.ISRO తదుపరి మిషన్ ఆదిత్య L-1 మిషన్ కోసం సిద్ధమవుతోందని పేర్కొన్నారు.
నాసా ఏం చెప్పింది?
నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ కూడా చంద్రయాన్ మిషన్ కోసం ఇస్రోను అభినందించారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ఇస్రోను ఆయన అభినందించారు. చంద్రునిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన నాల్గవ దేశంగా అవతరించినందుకు భారతదేశాన్ని తాము అభినందిస్తున్నామనీ, ఈ మిషన్‌లో భాగస్వామి అయినందుకు తాము సంతోషిస్తున్నామని పేర్కొన్నారు.