ప్రయోగించిన 124 రోజుల్లోనే రాకెట్ బాడీ భూవాతావరణంలోకి రీ-ఎంట్రీ అయ్యింది.
బెంగళూరు : ఈ ఏడాది జూలై 14న చంద్రయాన్-3 వ్యోమనౌకను విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఎల్‌వీఎం3 ఎమ్4 లాంచ్ వెహికల్‌లోని క్రయోజెనిక్ ఎగువ దశ భూ వాతావరణంలోకి అనియంత్రితంగా రీ-ఎంట్రీ అయ్యిందని ఇస్రో తెలిపింది. ఈ రాకెట్ బాడీ LVM-3 M4 లాంచ్ వెహికల్‌లో భాగమని తెలిపింది. ఇది బుధవారం మధ్యాహ్నం 2.42 గంటల ప్రాంతంలో భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది.
భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 విజయవంతమై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా భారత్ చంద్రుడిపై ఎవరూ చేరుకోలేని ప్రాంతానికి చేరి దేశ జెండాను ఎగరవేసింది. అయితే తాజాగా చంద్రయాన్ 3 వ్యౌమనౌకను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఎల్విఎం 3ఎం4 లాంచ్ వెహికల్ లోని క్రయోజనిక్ ఎగువదశ అదుపు తప్పింది. ఇది భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది.
ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. దీనికి సంబంధించి ఇస్రో ఒక ప్రకటన చేస్తూ…‘ఉత్తర పసిఫిక్ మహాసముద్రం మీద దీని సంభావ్య ప్రభావ స్థానం అంచనా వేశాం. చివరి గ్రౌండ్ ట్రాక్ ప్రకారం భారత్ మీదుగా ఇది వెళ్లలేదు’ అని ప్రకటించింది. భూ వాతావరణం లోకి ప్రవేశించిన ఈ భాగం ఎల్ వీఎం-ఎం4 వాహన నౌకకు చెందిందిగా తెలిపింది.