Ayodhya Ram Mandir: ఆలోగా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి.. భ‌క్తుల ద‌ర్శ‌నానికి అవ‌కాశం  

By Rajesh KFirst Published Aug 14, 2022, 3:29 AM IST
Highlights

Ayodhya Ram Mandir: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణ పనులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. రామాలయం ప్రధాన సముదాయాన్ని నిర్మించిన తర్వాత సంద‌ర్శించ‌డానికి భ‌క్తుల‌కు అవకాశం క‌ల్పించ‌నున్నారు.  

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఈ మేర‌కు ఆలయ నిర్మాణ పనుల గురించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప‌లు అంశాల‌ను వెల్లడించారు.

వ‌చ్చే ఏడాది డిసెంబర్ నాటికి శ్రీరామ్ లల్లాను ప్రజలు దర్శించుకోవచ్చని తెలిపారు. అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి యావ‌త్తు హిందూ స‌మాజం చాలా ఆసక్తిగా చూస్తుందని తెలిపారు. భ‌క్తులను ఆకట్టుకునేలా రామమందిరంలో అనేక‌ డిజైన్ ను రూపొందించినట్లు చెప్పారు. ఉత్తరభారతదేశంలో ఇంత భారీ ఆలయం మరెక్కడా లేదని అన్నారు. 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రక్షాబంధన్ పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంపత్ రాయ్ శ‌నివారం నాడు సుల్తాన్‌పూర్ కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సుల్తాన్‌పూర్ అయోధ్యకు సమీపంలో ఉందని, అందుకే ఇక్కడి ప్రజలను డిసెంబర్ 23న శ్రీరామ్ లల్లా దర్శనానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పనుల పురోగతిపై సమాచారం ఇస్తూ ఆలయ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని కూడా అందించారు.

ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, 2023 డిసెంబర్ నాటికి ఆలయాన్ని సందర్శించేందుకు వీలుంటుందని చంపత్ రాయ్ తెలియజేశారు. ఆలయ నిర్మాణంలో ఇనుము వాడడం లేదన్నారు. భూకంపాలు, తుపాన్లతో పాటు ఇతర ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా రామ మందిర ఆలయ నిర్మాణం జరుగుతుంద‌ని తెలిపారు. ఎన్నివేల ఏండ్ల‌యినా.. ఆల‌యం చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మిస్తున్నామ‌ని తెలిపారు.

ఆల‌య నిర్మాణంలో రాయి, రాయికి మధ్య రాగి పలకలను ఏర్పాటు చేస్తున్న‌మ‌నీ, అలాగే కాంక్రీటు పైన రాళ్లు వేస్తున్న‌మ‌ని తెలిపారు. ఆలయంలో అనేక ర‌కాల‌ డిజైన్‌లతో నిర్మిస్తున్నార‌నీ, అందులోని క‌ళ‌రూపాల‌ను భక్తులు చూస్తూనే ఉంటారంటే అతిశయోక్తి కాదని రాయ్ అన్నారు.

అనేక వివాదాల అనంత‌రం.. సుప్రీం ఆదేశాల మేరకు రామమందిర ఆలయ నిర్మాణ పర్యవేక్షణ, నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
 
ఇదిలా ఉంటే..ఇటీవ‌ల‌ అయోధ్యలో భూములపై అక్రమంగా ఒప్పందాలు చేసుకోవడం కలకలం రేపింది. ఈ నేప‌థ్యంలో అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే తదితర 40 మంది పేర్లను అయోధ్య ఆల‌య క‌మిటీ ప్రకటించింది. వారు అక్రమంగా అయోధ్యలో క్రయవిక్రయాలు జరపడం, కాలనీలను నిర్మించడం వంటి చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది

click me!