పీఎం-కిసాన్‌ సమ్మాన్ నిధి మొత్తం పెంపుపై కేంద్రం క్లారిటీ..

By Sumanth KanukulaFirst Published Feb 7, 2023, 5:08 PM IST
Highlights

రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6వేలు చొప్పున అందజేస్తోంది.

రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6వేలు చొప్పున అందజేస్తోంది. ప్రతి నాలుగు నెలలకు రూ. 2 వేలు చొప్పు మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందించే ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచబోతుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా ఆ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద ప్రస్తుతం లబ్ధిదారునికి రూ. 6,000 అందజేస్తున్నామని.. ఆ మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని కేంద్రం ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో తెలియజేసింది. పీఎం-కిసాన్ కింద అందజేసే మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  ‘‘ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదు’’ అని పేర్కొన్నారు. 

ఈ ఏడాది జనవరి 30 నాటికి.. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలతో పాటు గృహ అవసరాలకు సంబంధించిన ఖర్చులను చూసుకోవడానికి ఆదాయ మద్దతుగా వివిధ వాయిదాల ద్వారా అర్హులైన రైతులకు రూ. 2.24 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు.

ఇక, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. ఇందుకు సంబంధించి 100 శాతం నిధులను కేంద్రం సమకూరుస్తోంది. 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.

click me!