
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఐదేళ్లకు పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌లను (Centre brings ordinance) తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థల డైరెక్టర్ల పదవీకాలం రెండేళ్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు లేనందున కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.అయితే ఆర్డినెన్స్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టాన్నితీసుకురావాలని భావిస్తున్నట్టగా సమాచారం.
ఆర్డినెన్స్‌ల ప్రకారం.. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల రెండేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత.. ఒక్కసారికి ఒక్క ఏడాది చొప్పున మూడేళ్ల వరకు పొడిగింపు ఇవ్వనున్నారు. ప్రాథమిక నియామకంలో పేర్కొన్న వ్యవధితో సహా మొత్తం ఐదు సంవత్సరాల వ్యవధి పూర్తైన తర్వాత ఎటువంటి పొడగింపు ఇవ్వబడదు. ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ తన ప్రారంభ నియామకంపై పదవిని కలిగి ఉన్న వ్యవధిని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, క్లాజ్(ఎ) కింద కమిటీ సిఫార్సుపై రాతపూర్వకంగా కారణం నమోదు మేరకు ఒక్కసారికి ఒక్క ఏడాది వరకు పొడిగించవచ్చు’ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (అమెడ్మెంట్) ఆర్డినెన్స్ 2021 పేర్కొంది.
2018లో బాధ్యతలు స్వీకరించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపుతో ముడిపడి ఉన్న కేసులో జస్టిస్ ఎల్‌ఎన్ రావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. పదవీకాలం పొడగింపు అనేది అసాధారణ కేసులలో మాత్రమే చేయాలని అని పేర్కొంది. వివరాలు.. 1984 బ్యాచ్‌కుచెందిన ఐఆర్ఎస్ అధికారి సంజయ్ కుమార్ మిశ్రాను.. 2018 నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం ఈడీ డైరెక్టర్‌గా నియమించింది. అయితే గతేడాది ఆయన పదవీకాలం మరో ఏడాది పొడగించింది. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రాను నియమిస్తూ 2018 నవంబర్ 19న వెలువరించిన ఉత్తర్వులను సవరించేందుకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అంగీకరించారు. అయితే మరో మూడు, నాలుగు రోజుల్లో ఎస్‌కే మిశ్రా పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం గమనార్హం.
ఇక, 1997కి ముందు సీబీఐ డైరెక్టర్ల పదవీకాలం నిర్ణయించబడలేదు. వారిని ప్రభుత్వం ఏ కారణం చేతనైనా తొలగించేందుకు అవకాశం ఉండేది. అయితే.. వినీత్ నరైన్ తీర్పులో సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ స్వతంత్రంగా పని చేయడానికి అనుమతించడం కోసం.. కనీసం రెండేళ్ల పదవీకాలాన్ని నిర్ణయించింది.