హనుమంతుడి కాళ్లు మొక్కి.. ముందున్న హుండీ కొట్టేసిన దొంగ.. వైరల్ అవుతున్న వీడియో ఇదే

By telugu teamFirst Published Nov 14, 2021, 3:44 PM IST
Highlights

ఆ భక్తుడికి దేవుడిపై భయం భక్తి ఉన్నది. కానీ, దేవుడి ముందు ఉన్న హుండీపైనా గురి ఉన్నది. ఓ రోజు రాత్రి పూట గుడిలో అడుగుపెట్టి హనుమంతుడికి దండం పెట్టుకున్నాడు. హనుమంతుడి విగ్రహం ముందు ఉన్న హుండీని పట్టుకుని పరారయ్యాడు. పోలీసులకు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. నిందితుడిని పోలీసులు పట్టుకుని దొంగిలించిన మొత్తాన్ని రికవరీ చేశారు. చోరీ ఉదంతం మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ ఫుటేజీ ఇప్పుడు వైరల్ అవుతున్నది.
 

ముంబయి: ఆ దొంగ భక్తుడు ఎవరూ లేని సమయంలో గుడిలోకి ప్రవేశించాడు. చుట్టూ చూశాడు.. ఎవరూ లేరు.. హమ్మయ్యా అనుకున్నాడు. కానీ, ఎదురుగా దేవుడు చూస్తూనే ఉన్నాడే.. ఎలా అని ఆలోచన పడిందో ఏమో.. ఆ దొంగ హనుమంతుడి కాళ్లు మొక్కాడు. తన పనికి ఆటంకం కలిగించవద్దనే స్వామి ముందు ఉన్న హుండీని చేత పట్టుకుని గుడి విడిచి పరుగు పెట్టాడు. ఇదంతా ఓ సీసీటీవీలో రికార్డ్ అయింది. సీసీటీవీని పట్టించుకోలేదు.. కానీ.. హనుమంతుడికే క్షమాపణలు చెప్పి దొంగతనం చేశాడు. కానీ, ఆయన విన్నపాలు నేలపాలయ్యాయి. ఎందుకంటే పోలీసులు ఆ దొంగ కూపీని లాగి పట్టేసుకున్నారు. దొంగిలించిన మొత్తాన్ని కక్కించారు. సీసీటీవీలో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. థానెలో ఖోపాట్ ఏరియాలో హనుమంతుడి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ముందున్న హుండీపై ఆ దొంగ కన్ను పడింది. ఈ నెల 9వ తేదీ రాత్రి ఆ గుడిలోకి ప్రవేశించాడు. చుట్టూ చూసి హనుమంతుడికి దండం పెట్టుకున్నాడు. ముందును హుండీని పట్టుకుని పరారయ్యాడు. సీసీటీవీలో ఇలాగే కనిపించిందని పోలీసులూ చెప్పారు.

Also Read: బ్యాంక్ క్యాషియర్‌కు హ్యాండ్ రైటింగ్ అర్థం కాలేదు.. దొంగకు పరాభవం

ఆ హుండీలో సుమారు వేయి రూపాయలు ఉండి ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిందితుడి ఆనవాళ్లను పట్టుకుని ఆ ఏరియాలో ఆరా తీశారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. శనివారం అరెస్టు చేశారు. దొంగిలించిన మొత్తాన్ని నిందితుడి నుంచి రికవరీ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో దుమారం రేపుతున్నది.

click me!