8 ఏళ్లలో 3000 ఈడీ రైడ్లు.. దోషులు 23 మంది.. 211 మంది చట్టసభ్యులు బీజేపీలో చేరారు: రాజ్యసభలో ఆప్ ఎంపీ

By Mahesh KFirst Published Dec 12, 2022, 8:51 PM IST
Highlights

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని రాజ్యసభలో ఆరోపణలు సంధించారు. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రతిపక్ష నేతలపై ఈడీ సుమారు 3000 రైడ్లు చేపట్టగా అందులో దోషులుగా తేలింది 23 మంది అని అన్నారు. ఇదే కాలంలో వివిధ పార్టీల నుంచి 211 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలోకి చేరారని వివరించారు.
 

న్యూఢిల్లీ: రాజ్యసభలో ఈ రోజు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన గణాంకాలు వివరిస్తూ ఆరోపణలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం క్యారెక్టర్‌ను ప్రశ్నించడంతో అధికార ఎంపీలు భగ్గుమన్నారు. దీంతో తమను బయట మాట్లాడనివ్వరూ.. సభలోనూ మాట్లాడనివ్వరా అంటూ ఎదురుతిరిగారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రతిపక్ష నేతలపై ఈడీ సుమారు 3,000 సార్లు రైడ్లు చేపట్టిందని అన్నారు. ఇందులో కేవలం 23 మందిని దోషులుగా తేల్చగలిగిందని, అంటే అది చేపట్టిన రైడ్లలో 0.5 శాతం మాత్రమే విజయవంతమైనవని తెలుస్తున్నదని వివరించారు. 

‘ప్రతిపక్ష నేతలపై పడిన ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల మోసం చేసిన నీరవ్ మోడీని ఎందుకు పట్టించుకోరు? నా ప్రశ్న ఏంటంటే.. దొంగలు, దోపిడీదారులైన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, రెడ్డి బ్రదర్స్, యడ్యూరప్ప, వ్యాపామ్ స్కామ్‌లపై ఈడీ, సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవు? మీతోటే ఉండే అవినీతిపరులపై ఎందుకు యాక్షన్ తీసుకోవు?’ అని ప్రశ్నించారు. 

Also Read: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ త‌న కుమార్తెకు అక్ర‌మంగా కాంట్రాక్ట్ అప్ప‌గించారు - ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ ఆరోప‌ణ‌

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై 14 గంటలపాటు రైడ్ చేశారని, అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపైనా రైడ్ చేశారని, సత్యేందర్ జైన్‌ను జైలుకు పంపారని అన్నారు. మంత్రులందరిపై రైడ్లు చేశారని తెలిపారు. ‘ఒకరిని వేధించి, నియంతృత్వంతో దేశాన్ని పాలించాలనుకుంటే అందరినీ జైలులో పెట్టండి’ అంటూ మండిపడ్డారు.

ఇదే సందర్భంలో ఆయన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ రిపోర్టునూ ప్రస్తావించారు. 2014 నుంచి 2022 మధ్య కాలంలో 211 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు వీడి బీజేపీలో చేరారని అన్నారు. ఇవి బలవంతంగా పార్టీ వదిలి ఈ పార్టీలో చేరేలా చేస్తున్నాయని అర్థం అవుతున్నదని వివరించారు. ఇది పూర్తిగా ప్రజా తీర్పునే మార్చివేయొచ్చు అని అన్నారు. ఇది ప్రభుత్వస్థాయిలోనే కాదు.. ఎన్నికైన చట్టసభ్యుడి స్థాయిలోనూ ప్రభావితం చేయగలదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్నే పక్కదారి పట్టించే ఈ ఆపరేషన్ గురి ఇప్పుడు మున్సిపాలిటీల దాకా చేరిందని ఢిల్లీ మున్సిపల్ కౌన్సిలర్లపై ప్రలోభాల అంశాన్ని పేర్కొన్నారు.

click me!