
న్యూఢిల్లీ: పంజాబ్‌లో అధికార పార్టీ కాంగ్రెస్ వెనుకంజలో ఉండగా.. లీడ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్లుతున్నది. దీంతో ఆప్ శ్రేణుల్లో ఉత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన భగవంత్ మన్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో ఆప్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని భగవంత్ మన్ ముందుగానే విశ్వాసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయమే సంగ్రూర్‌లోని భగవంత్ మన్ ఇంటిని పూలతో అలంకరించారు. సౌండ్ బాక్స్‌లు, బ్యాండ్లు తెచ్చారు. జిలేబీ వంటకాలు ప్రారంభించారు. రౌండ్ల మీద రౌండ్లు పెరిగిన కొద్దీ ఆప్ ఆధిక్యం నిలకడగా రాణిస్తుండటంతో భగవంత్ మన్ నివాసంలో భాంగ్రా డ్యాన్సులు ప్రారంభం అయ్యాయి. ముగ్గులు వేసిన ముంగిళ్లలో అభిమానులు చీపుర్లు పట్టుకునీ చిందులు వేస్తున్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్, పంజాబ్ ఆప్ సీఎం క్యాండిడేట్ భగవంత్ మన్‌ల ఇద్దరి భారీ ఫ్లెక్సీని ఏ్రపాటు చేశారు. ఆ భారీ ఫ్లెక్సీని పూలతో అలంకరించారు.
ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ ధూరి సీటులో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దల్వీర్ సింగ్ గోల్డీపై ఆయన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 2014 మే నుంచి ఆయన సంగ్రూర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా భగవంత్ మన్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బతీసేలా ఉన్నాయి. ఫలితాల సరళి చూస్తుంటే.. కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదని స్పష్టం అవుతున్నది. కాగా, తొలిసారి ఆప్ ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించి అధికార పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉన్నట్టు అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు పశ్చాత్తాపంలోకి వెళ్లుతున్నట్టు అర్థం అవుతున్నది. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే రాజీనామాను ప్రకటించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. మంగళవారం ఉదయం ఆయన చండీగడ్‌లోని తన అధికారిక నివాసానికి చన్నీ వచ్చారు. త్వరలోనే రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలవబోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత వైరుధ్యాలు కొంతకాలంగా తీవ్రమైన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణల కారణంగానే కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత సిద్దూ సీఎం అవుతారని ఆశించినా.. పార్టీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా దళితుడైన చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా చాలా కాలానికి గానీ అక్కడ సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేకపోయింది. అప్పటి వరకు నవజోత్ సింగ్ సిద్దూ, చరణ్‌జిత్ సింగ్ చన్నీల మధ్య బేధాభిప్రాయాలు కొనసాగుతూ వచ్చాయి.
కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చరణ్‌జిత్ సింగ్‌నే సీఎంగా ప్రకటించాలని ముందుగానే భీష్మించుకుంది. అందుకే ఆయనను రెండు స్థానాల నుంచీ పోటీకి దింపింది. చామ్‌కౌర్ సాహిబ్, బదౌర్‌ల నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, ఈ రెండు స్థానాల్లోనూ ఆయన వెనుకంజలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాజీనామాకు సిద్ధం అయినట్టు తెలుస్తున్నది.