లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా వున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. నిష్పక్షపాతం, పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఈసీ ఆదేశించారు.
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా వున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం భువనేశ్వర్‌లో ప్రధాన ఎన్నికల కమీషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఒడిశాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు.
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. నిష్పక్షపాతం, పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఈసీ ఆదేశించారు. రాజకీయ పార్టీలకు అందుబాటులో వుండాలని.. ధన ప్రవాహం, హింసకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను సీల్ చేసి.. స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించాలని సీఈసీ రాజీవ్ కుమార్ ఆదేశించారు.
మొత్తం మీద ఎన్నికల సంఘం మాటలను బట్టి చూస్తే.. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం వున్నట్లు అర్ధమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఏప్రిల్ లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మే నెలలో ఫలితాలు ప్రకటించే అవకాశం వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.