
Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 275కు చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. 275 మృతదేహాల్లో కేవలం 88 మృతదేహాలను మాత్రమే గుర్తించి బంధువులకు అప్పగించినట్టు జూన్ 4న ప్రభుత్వం తెలిపింది. ఇంకా తమవారి గురించి వివరాలు తెలియకపోవడంతో చాలా మంది తమ ప్రియమైన వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇదిలావుండగా, ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించిన సీబీఐ బృందం.. విచారణను ప్రారంభించింది.
వివరాల్లోకెళ్తే.. 10 మంది సభ్యుల సీబీఐ బృందం బాలాసోర్ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి ట్రిపుల్ రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈసీవోఆర్ ఖుర్దా రోడ్ డివిజన్ డీఆర్ఎం రింతేష్ రే మాట్లాడుతూ తనకు అందిన సమాచారం మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభమైందనీ, అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే తెలియరాలేదని తెలిపారు. ఈ ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది.
అంతకు ముందు రైల్వే సేఫ్టీ కమిషనర్ శైలేష్ కుమార్ పాఠక్ బహనాగ బజార్ రైల్వే స్టేషన్ లోని కంట్రోల్ రూమ్, సిగ్నల్ రూమ్, సిగ్నల్ పాయింట్ కు వెళ్లి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ ప్రమాదంపై బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీసులు జూన్ 3న భారతీయ శిక్షాస్మృతి, రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, జూన్ 5న ఒడిశా ట్రిపుల్ ట్రైన్ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 278గా రైల్వే శాఖ ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సవరించిన సంఖ్య మాత్రం 275గా ఉంది.
ఒడిశాలోని బాలసోర్ లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో 278 మంది మరణించగా, 1002 మంది గాయపడ్డారని ఖుర్దా రోడ్ డివిజన్ డీఆర్ఎం రింకేశ్ రాయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మరణాల సంఖ్య 275గా ఉండటంపై ఆయన స్పందిస్తూ.. కాలంతో పాటు గణాంకాలు మారుతున్నాయన్నారు. గతంలో మృతుల సంఖ్య 288 ఉండగా, కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం దానిని 275కు సవరించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాద గణాంకాలను ప్రశ్నించారు. తమ రాష్ట్రానికి చెందిన 61 మంది మరణించారనీ, ఇంకా 182 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు.
గాయపడిన 1,100 మందిలో 200 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని రాయ్ తెలిపారు. 278 మృతదేహాల్లో 177 మృతదేహాలను గుర్తించామనీ, మరో 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని, ఈ అన్ క్లెయిమ్డ్ మృతదేహాలను ఆరు వేర్వేరు ఆస్పత్రుల్లో ఉంచామని తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రైల్వే శాఖ సిబ్బందిని మోహరించింది. మృతదేహాలను శాస్త్రీయ పద్ధతిలో భద్రపరుస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.