
తన కామవాంఛలు తీర్చుకోవడానికి సుమారు 50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ అధికారిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.... ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాకు చెందిన రామ్‌భవన్ అనే వ్యక్తి ప్రభుత్వ జూనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
అతడు బండ, చిత్రకూట్, హమీర్పూర్ జిల్లాల్లో 5 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రామ్‌భవన్‌ను బండ జిల్లాలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిందితుడి ఇంటిలో నిర్వహించిన సోదాల్లో అధికారులు సైతం నిర్ఘాంతపోయారు.
8 మొబైల్ ఫోన్లు, రూ.8 లక్షల నగదు, ల్యాప్‌టాప్, ఇతర డిజిటల్ సాక్ష్యాలు, భారీ సంఖ్యలో చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్స్, వీడియోలు రామ్‌భవన్ ఇంట్లో బయటపడ్డాయి.
అంతేకాకుండా పోర్నోగ్రఫీకి సంబంధించిన ఆ సమాచారాన్ని షేర్ చేసుకునే విషయంలో అతడు పలువురు విదేశీయులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఈ మెయిల్స్ పరిశీలించగా తెలిసింది.
తాను చేసే అసాంఘిక కార్యకలాపాల గురించి చిన్నారులు బయట చెప్పకుండా ఉండేందుకు మొబైల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వారికి రామ్‌భవన్ గిఫ్ట్‌లుగా ఇచ్చేవాడు. ఇదే విషయాన్ని నిందితుడు విచారణలో అంగీకరించాడు.