Delhi Liquor Scam : తీహార్ జైల్లోనే కల్వకుంట్ల కవిత మళ్లీ అరెస్ట్... 

By Arun Kumar P  |  First Published Apr 11, 2024, 3:28 PM IST

ఇప్పటికే డిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయి తీహార్ జైల్లో వున్న కేసీఆర్ కూతురు కవితకు మరో షాక్ తగిలింది. ఆమె జైల్లో వుండగానే సిబిఐ అరెస్ట్ చేసింది. 


న్యూడిల్లీ : దేశ రాజధాని డిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో వున్న కవితను తాజాగా సిబిఐ అరెస్ట్ చేసింది. 

అసలు ఏమిటీ లిక్కర్ కేసు :  

Latest Videos

దేశ రాజధాని న్యూడిల్లీలో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో వుంది... అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి. అధికారంలోకి రాగానే డిల్లీలో కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చింది ఆప్ సర్కార్. ఈ పాలసీ ప్రకారం మద్యం రిటైల్ అమ్మకాలను ప్రభుత్వం కాకుండా లైసెన్స్ కలిగిన ప్రైవేట్ వ్యక్తులు చేపట్టేలా పాలసీని రూపొందించారు. దీంతో డిల్లీ ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగింది. 

అయితే ఈ లిక్కర్ పాలసీలో భారీ అవకతవకలు జరిగినట్లు డిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఆరోపణలతో దుమారం రేగింది.  డిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఈ లిక్కర్ పాలసీ వ్యవహారంపై సిబిఐ ఎంక్వయిరీకి ఆదేశించారు. దీంతో వెనక్కితగ్గిన కేజ్రీవాల్ సర్కార్ నూతన లిక్కర్ పాలసీని వెనక్కి తీసుకుంది. 

సిబిఐ విచారణ : 

నూతన లిక్కర్ పాలసీపై కేజ్రీవాల్ సర్కార్ వెనక్కి తగ్గినా సిబిఐ విచారణ మాత్రం కొనసాగింది. ఈ క్రమంలోనే డిల్లీ ప్రభుత్వ పెద్దలు, సౌత్ గ్రూప్ పేర్లు బయటకు వచ్చాయి. డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియాతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, వ్యాపార ప్రముఖుల పేర్లు బయటకు వచ్చారు. సౌత్ గ్రూప్ లోని బిఆర్ఎస్ నాయకురాలు కవిత, వైసిపి నేత మాగుంట శ్రీనివాసులు, అరబిందో ఫార్మా యజమాని శరత్ రెడ్డితో పాటు మరికొందరు డిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం కలిగివున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించారు. డిల్లీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, కవిత లతో పాటు అనేకమందిని సిబిఐ విచారించింది. 

ఈడి విచారణ : 

డిల్లీ లిక్కర్ స్కాంలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. లోతుగా విచారణ జరిపిన ఈడి చాలారోజుల క్రితమే డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఇటీవల డిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ మాజీ సీఎం కూతురు కవితను అరెస్ట్ చేసింది. వీరిద్దరికి కోర్టు రిమాండ్ విధించడంతో జైల్లో రిమాండ్ ఖైదీగా వున్నారు. 

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీఏ బుచ్చిబాబును అరెస్ట్ చేసిన ఈడి అతడి నుండి కీలక సమాచారాన్ని సేకరించింది. అప్రూవర్ గా మారిన అతడు ఈ లిక్కర్ పాలసీలో కవిత పాత్ర వుందని నిర్దారించాడు. ఈ సౌత్ గ్రూప్ లోని కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ రెడ్డి తరపున అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినిపల్లి, బుచ్చిబాబు డిల్లి ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా,  విజయ్ నాయర్ తో వీరు సంప్రదింపులు జరిపి డీల్ కుదిర్చినట్లు ఈడీ విచారణలో గుర్తించింది. 

2022 లో  ఈ లిక్కర్ ఫాలసీ విషయమై ఎమ్మెల్సీ కవిత నివాసంలో సమావేశం జరిగిందని తేలింది. ఈ క్రమంలోనే ఇండో స్పిరిట్ వాటాపై ఆప్ నేతలతో కవితకు ఒప్పందం కుదిరింది.... రూ.100 కోట్ల ముడుపులకు బదులు ఈ వాటా ఇచ్చారని ఈడి  గుర్తించింది. 

కవిత  అరెస్ట్ : 

సుధీర్ఘ విచారణ తర్వాత డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రను గుర్తించిన ఈడీ ఇటీవల అరెస్ట్ చేసారు. ఆ తర్వాత డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసారు. కవిత కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు.  దీంతో బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదురు అయ్యింది. తాము బెయిల్ ఇవ్వలేమని... ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ట్రయల్ కోర్టును కూడా కవిత బెయిల్ పిటిషన్ పై జాప్యం చేయకుండా విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 

ఇలా బెయిల్ ప్రయత్నాల్లో వున్న కవితకు సిబిఐ షాక్ ఇచ్చింది. తీహార్ జైల్లో వున్న ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇదే జైల్లో కవితను సిబిఐ అధికారులు విచారించనున్నారు. కవిత అరెస్ట్ కు సంబంధించి సిబిఐ ప్రకటన చేసింది. కవితను జైలు నుండి సిబిఐ హెడ్ క్వార్టర్ కు తరలించి రేపు(శుక్రవారం) కోర్టులో హాజరుపర్చే అవకాశాలున్నాయి... తమ కస్టడీలోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నారు. 

click me!