సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలు చేసిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఉపరాష్ట్రపతిపై కేసు.. ‘వారి బాధ్యతల నుంచి తప్పుకోవాలి

By Mahesh KFirst Published Feb 2, 2023, 2:02 PM IST
Highlights

సుప్రీంకోర్టుపై అవమానకర రీతిలో, ప్రజల్లో దాని ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజులపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని బాంబే లాయర్స్ అసోసియేషన్ ఓ పిల్ వేసింది. వారు రాజ్యాంగ బద్ధ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
 

ముంబయి: న్యాయ వ్యవస్థ, కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజులపై కేసు నమోదు చేయాలని బాంబే లాయర్స్ అసోసియేషన్ బాంబే హైకోర్టులో ఓ రిక్వెస్ట్ ఫైల్ చేశారు. వీరిద్దరూ ప్రజల్లో సుప్రీంకోర్టు ప్రతిష్టను దిగజార్చారని బాంబే లాయర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ మేరకు ప్రజా ప్రయోజనా వ్యాజ్యాన్ని బాంబే లాయర్స్ అసోసియేషన్ తమ చైర్మన్ అహ్మద్ అబీదీ ద్వారా దాఖలు చేసింది. రాజ్యాంగంపై నమ్మకం లేనందున తమను తాము రాజ్యాంగ బద్ధ పదవుల నుంచి తప్పుకున్నట్టు డిక్లరేషన్ కావాలని వారు ఆ పిల్‌లో పేర్కొన్నారు.

‘ఉపరాష్ట్రపతి, న్యాయ శాఖ మంత్రి న్యాయవ్యవస్థ ముఖ్యంగా సుప్రీంకోర్టుపై ఎదురుదాడికి దిగారు. అదీ అవమానకర రీతిలో, అభ్యంతరకర భాషలో వ్యాఖ్యలు చేశారు. యథాతథ స్థితిని మార్చాలని తరుచూ మాట్లాడారు. కానీ, అందుకు సుప్రీంకోర్టు రూపొందించిన ఎలాంటి అవకాశాలను పేర్కొనకుండా దాడి చేశారు’ అని ఆ రిక్వెస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read: మేం ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.. జడ్జీలు ఒక్కసారి నియామకమైతే చాలు: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు

‘పైన పేర్కొన్నవారి దాడి కేవలం న్యాయ వ్యవస్థపైకే పరిమితమైనది కాదు. అది భారత రాజ్యాంగంపై బహు స్పష్టమైన దాడి. న్యాయ వ్యవస్థపై, భారత రాజ్యాంగంపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేసినప్పటికీ వారిపై ఏ రాజ్యాంగబద్ధ అధికార యంత్రాంగం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు’ అని తెలిపారు. 

అంతేకాదు, ఉపరాష్ట్రపతి, న్యాయ శాఖ మంత్రులు తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 

ముగ్గురు న్యాయమూర్తుల పదోన్నతి పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూ తిరస్కరిస్తూ వస్తున్నది. సుప్రీంకోర్టు మరోసారి వారి పేర్లను పదోన్నతి కోసం సిఫారసు చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలను, వాటికి సుప్రీంకోర్టు సమాధానాలను బహిర్గతం చేసింది. ఈ రెంటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అందులో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)ల డాక్యుమెంట్‌నూ బయటపెట్టింది. రా, ఐబీల డాక్యుమెంట్‌లను బయటపెట్టడం చాలా ఆందోళనకరం అని సుప్రీంకోర్టు పై న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కామెంట్ చేశారు.

‘రా, ఐబీల సీక్రెట్, సెన్సిటివ్ రిపోర్టులను బహిరంగ పరచడం చాలా ఆందోళనకరం, దీనిపై నేను తగిన సమయంలో స్పందిస్తాను. వాటిపై మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు’ అని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు విలేకరులకు తెలిపారు.

click me!