ట్రక్ కిందికి చొచ్చుకెళ్లిన కారు.. ఐదుగురు స్పాట్ డెడ్

By telugu teamFirst Published Aug 12, 2021, 1:20 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. బాలిక సహా డ్రైవర్ ప్రాణాలతో ఉండగా హాస్పిటల్‌కు తరలించారు. డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. 
 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు ముందే ఉన్న కంటెయినర్ ట్రక్కు కిందకు చొచ్చుకెళ్లింది. యూపీలోని బస్తి జిల్లాలో పురయినా క్రాస్ చేస్తుండగా గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్‌లోనే మరణించారు. మరో బాలిక, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిరువురిని హాస్పిటల్ చేర్చగా బాలిక ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు చెప్పగా, డ్రైవర్ పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నదని వెల్లడించారు.

బాలిక కుటుంబం లక్నో నుంచి జార్ఖండ్‌కు కారులో బయల్దేరింది. కానీ, గురువారం ఉదయం బస్తి జిల్లా పురయినా ఏరియా దాటుతుండగా యాక్సిడెంట్ జరిగింది. కంటెయినర్ ట్రక్ కిందికి దాదాపుగా మొత్తం కారు చొచ్చుకెళ్లింది. ఈ కారును బయటకు తీయడానికి ప్రత్యేకంగా క్రేన్‌ను తీసుకురావాల్సి వచ్చింది. కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని, ఇందులో ఐదుగురు అక్కడికక్కడే మరణించారని కల్వారి సర్కిల్ ఆఫీసర్ అలోక్ ప్రసాద్ తెలిపారు. బాలిక, డ్రైవర్‌ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించారని, వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించామని వివరించారు. బాలిక సేఫ్‌గానే ఉన్నదని, డ్రైవర్ పరిస్థితే ఆందోళనకరంగా ఉన్నదని చెప్పారు.

ఈ దుర్ఘటనపై రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అధికారులను ఆదేశించారు.

click me!