పార్లమెంటులో మహిళా ఎంపీలపై దాడి.. ఢిల్లీలో అపోజిషన్ ఫైర్

By telugu teamFirst Published Aug 12, 2021, 12:43 PM IST
Highlights

రాజ్యసభలో మహిళా ఎంపీలపై మార్షల్స్ దాడి చేశారని, పార్లమెంటు సమావేశాలను అర్ధంతరంగా ముగించారని పేర్కొంటూ ప్రతిపక్షాలు గురువారం ఉదయం పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ తీశాయి. రాజ్యసభలో తొలిసారిగా మహిళా ఎంపీలపై దాడి జరిగిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్యగావించడమేనని రాహుల్ గాంధీ, సంజయ్ రౌత్ సహా పలువురు అపోజిషన్ లీడర్లు ఆరోపించారు.
 

న్యూఢిల్లీ: పార్లమెంటు ఎగువ సభలో బుధవారం భారీగా మార్షల్స్‌తో మోహరించిన వైనంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాజ్యసభలో మహిళా ఎంపీలపై కేంద్రం మార్షల్స్‌తో దాడి చేయించిందని, ఇది ప్రజాస్వామ్య హత్యేనని అన్నారు. పార్లమెంటులో ఎంపీలపై దాడి, అర్ధంతరంగా పార్లమెంటు సమావేశాలను ముగించడాన్ని నిరసిస్తూ 15 పార్టీల నేతలు రాహుల్ గాంధీ సారథ్యంలో పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ తీశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే, శివసేన నేత సంజయ్ రౌత్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఇందులో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ప్రతిపక్ష ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశమివ్వలేదని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే నేడు నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టు వివరించారు. బుధవారంనాడు రాజ్యసభలో తొలిసారి ఎంపీలపై దాడి జరిగిందని, బయటి వ్యక్తులు మార్షల్స్డ్రె డ్రెస్‌లో సభలోకి వచ్చారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య హత్యేనని అన్నారు. రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌లు సభలో గందరగోళంపై కలత చెందినట్టు తెలిపారని, కానీ, సభ నిర్వహించాల్సిన బాధ్యత వారిదేనని చెప్పారు.

పార్లమెంటు సమావేశాలను అర్ధంతరంగా ముగించారని రాహుల్ గాంధీ తెలిపారు. తాము పెగాసస్, ధరలు, రైతుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తామని, కానీ, మాట్లాడటానికి ప్రభుత్వం అవకాశమివ్వలేదని అన్నారు. తద్వారా కనీసం 60శాతం మంది దేశ పౌరుల సమస్యలు పార్లమెంటులో వినిపించడానికి ఆస్కారమివ్వలేదని కేంద్రాన్ని విమర్శించారు. అంటే, 60శాతం మంది పౌరుల గళాలను నొక్కేసినట్టయిందని తెలిపారు.

రాహుల్‌తోపాటుగానున్న సంజయ్ రౌత్ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. మార్షల్స్ దుస్తుల్లో బయటి వ్యక్తులను పార్లమెంటులోకి తెచ్చారని, వారే మహిళా ఎంపీలపై దాడి చేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. రాజ్యసభలో భారీగా మార్షల్స్‌ నింపారని, తాను పార్లమెంటులో ఉన్నట్టుగా అనిపించలేదని అన్నారు. ఆ దృశ్యాన్ని చూస్తే పార్లమెంటులో కాక పాకిస్తాన్ బార్డర్‌లో ఉన్నట్టే అనిపించిందని వివరించారు.

గతనెలలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లో ప్రతిపక్షాల నిరసనలు, ఫలితంగా వాయిదాల పర్వమే సాగింది. మధ్యమధ్యలో కొన్ని బిల్లులు పాస్ అయినప్పటికీ ఆశించినంత చర్చ జరగలేదు. పెగాసస్, ద్రవ్యోల్బణం, రైతు ధర్నాలనే ప్రముఖంగా పేర్కొంటూ కాంగ్రెస్, తృణమూల్ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రతిరోజూ సభల్లో ఆందోళన ప్రదర్శనలు నిర్వహించాయి. మంగళవారం ప్రతిపక్ష నేతలు రాజ్యసభలో నల్లటి వస్త్రాలను ఊపుతూ బల్లలపైకి ఎక్కడం, అక్కడే నిలబడి నిరసనలు చేసి రభస సృష్టించారు. దీనిపై బుధవారం ఉదయాన్నే రాజ్యసభ చైర్మన్ సభలో కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే.

click me!