‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’.. కెప్టెన్ అమరీంద్ సింగ్ కొత్త పార్టీ పేరు.. కాంగ్రెస్‌కు రిజైన్

By telugu teamFirst Published Nov 2, 2021, 9:13 PM IST
Highlights

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ స్థాపించనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ పార్టీ పేరు పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని వెల్లడించారు. అంతేకాదు, ఇదే రోజు కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామాను ప్రకటించారు. ఇందులో కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు చేశారు. నవ్‌జోత్ సిద్ధూను విమర్శించారు.
 

చండీగడ్: Punjab మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎట్టకేలకు కొత్త పార్టీ పేరు ప్రకటించారు. తాను ఏర్పాటు చేయబోతున్న కొత్త రాజకీయ పార్టీ పేరు పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని వెల్లడించారు. ఈ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా జరుగుతున్నది. రాష్ట్ర రాజధాని చండీగడ్‌లో మంగళవారం మాజీ సీఎం Captain Amarinder Singh ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి Resignationనూ ప్రకటించారు. ఏడు పేజీల తన రాజీనామా పత్రాన్ని వెల్లడించారు. ఇందులో కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుబట్టడానికి వెనుకాడలేదు. పీసీసీ చీఫ్ Navjoth Singh Sidhuపైనా విమర్శలు గుప్పించారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నవ్‌జోత్ సింగ్ సిద్ధూకు ముకుతాడు వేయకుండా ఆయనకే అధికారాలను అప్పజెప్పారని కెప్టెన్ అమరీందర్ సింగ్ మండిపడ్డారు. తనను అవమానించడానికే సిద్దూ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించారు. తర్వాతి రోజు ఉదయమే తనకు సోనియా గాంధీ కాల్ చేశారని, సీఎం పదవి నుంచి దిగిపోవాల్సిందిగా సూచించారని వివరించారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తాను రాజీనామా చేశారని తెలిపారు. నవ్‌జోత్ సింగ్ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా చేసి తనను బాధపెట్టారని తెలిపారు. సిద్దూను ఆ పదవికి వద్దని తాను సలహా ఇచ్చినా, పార్టీ ఎంపీలందరూ విజ్ఞప్తి చేసినా ఆ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అది తనను కలచివేసిందని పేర్కొన్నారు.

Also Read: అమరీందర్ సింగ్ కొత్త పార్టీ.. కాంగ్రెస్‌లో కలవరం.. ‘బీజేపీతో సీట్ల ఒప్పందం.. సిద్దూను ఓడిస్తా’

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తన పిల్లల్లాగే ప్రేమిస్తానని కెప్టెన్ అమరీందర్ సింగ్ వివరించారు. రాజీవ్ గాంధీతో తనకు 1954 నుంచి స్నేహమున్నదని తెలిపారు. అంటే 67 ఏళ్ల అనుబంధమని గుర్తుచేసుకున్నారు.

14ఏళ్లపాటు బీజేపీతో ఉన్న ఓ వ్యక్తిని పీపీసీ ప్రెసిడెంట్‌గా చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఎంతటి దుస్థితికి దిగజారిందని బాధపడ్డట్టు వివరించారు. బీజేపీ నుంచి వచ్చిన నానా పటోలే, మరో పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇతర రాస్ట్రాల్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని విమర్శించారు. కాంగ్రెస్ అవసరం వచ్చినప్పుడు మహారాష్ట్రంలో శివసేనతో జతకట్టిందనీ గుర్తు చేశారు. అసలు కమ్యూనల్ ఎవరు? సెక్యులర్ ఎవరో ప్రజలే అర్థం చేసుకుంటారు అని వివరించారు.

అమరీందర్ సింగ్ కొత్త పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఉంటుందని నవ్‌జోత్ సింగ్ సిద్దూ ఇది వరకే ఆరోపణలు చేశారు. వాటిని ఖండిస్తూ కెప్టెన్ వివరణ ఇచ్చారు. తాను ఏర్పాటు చేసే కొత్త పార్టీ.. బీజేపీతో పొత్తులో ఉండదని స్పష్టం చేశారు. అయితే, సీట్ల పంపకాలపై ఒప్పందం ఉంటుందని వివరించారు. అలాగే, అకాలీలతో పొత్తు ఉండబోదని విస్పష్టంగా వివరించారు. 

Also Read: నన్ను సీఎం చేసి ఉంటే సక్సెస్ ఏంటో చూపెట్టేవాడ్ని.. ఈ సీఎం కాంగ్రెస్‌ను ముంచుతాడు.. వీడియోకు చిక్కిన సిద్దూ

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 117 సీట్ల నుంచీ తాము పోటీ చేస్తామని, తమ వెంట చాలా మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారని చెప్పారు. పార్టీ ప్రకటించిన తర్వాత వారి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. నవ్‌జోత్ సింగ్ సిద్దూ ఎక్కడి నుంచి పోటీ చేసినా తాము ఆయనపై పోరాడతామని వివరించారు. సిద్దూ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పాపులారిటీ 25శాతానికి పడిపోయిందని అన్నారు.

click me!