
న్యూఢిల్లీ: ఈడీ ఆఫీస్ లో మహిళను విచారించవచ్చా అనే విషయమై సుప్రీంకోర్టులో బుధవారం నాడు పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ పిటిషన్ దాఖలు చేసింది. .ఈ పిటిషన్ ను ఈ నెల 24న విచారించనున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈడీ అధికారులు తనను విచారణకు ఢిల్లీకి రావాలని కోరడంపై న్యాయపోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కవిత ఈ ప్రకటన చేసిన వారం రోజులకే ఇదే డిమాండ్ తో సుప్రీంకోర్టులో పిటిషన్ ను ఆమె దాఖలు చేశారు.
మహిళలను ఇంటికి వెళ్లి విచారించాలి. కానీ తనను ఈడీ కార్యాలయానికి పిలిచినట్టుగా కవిత ఆ పిటిషన్ లో తెలిపారు. . సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం మహిళను ఇంట్లోనే విచారించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇతరులతో కలిపి విచారణ చేస్తామని చెప్పి తనను మాత్రమే విచారించారని ఆ పిటిషన్ లో కవిత పేర్కొన్నారు.
మనీలాండరింగ్ చట్టం మేరకు ఈడీ కి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చినట్టుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరో వైపు ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించే విషయంలో ఎలాంటి మినహయింపులు లేవనే అభిప్రాయాన్ని కొందరు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏ రకమైన తీర్పును వెల్లడించనుందోననే విషయమై సర్వత్రా ఉత్కంఠనెలకొంది.