నేను తలుచుకుంటే.. ఇప్పుడే సీఎం కాగలను.. హేమమాలిని

First Published Jul 27, 2018, 10:37 AM IST
Highlights

 ‘నేను కావాలనుకుంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి కాగలను. నిమిషంలో ఆ పదవి పొందగలను. కానీ నేను ఆ పదవితో ముడిపడి ఉండటానికి ఇష్టపడను. దాని వల్ల నాకు పోరాడే స్వేచ్ఛ ముగిసిపోతుంది’ అని పేర్కొన్నారు.

తాను తలుచుకుంటే.. ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కాగలనని సినీనటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ధీమా వ్యక్తం చేశారు. కాకపోతే తనకు పదవీ కాంక్ష లేదని అందుకే అటువైపు చూడట్లేదని ఆమె పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మధుర ఎంపీ అయిన హేమా మాలిని ఇటీవల రాజస్థాన్‌లోని బన్స్‌వారా పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను కావాలనుకుంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి కాగలను. నిమిషంలో ఆ పదవి పొందగలను. కానీ నేను ఆ పదవితో ముడిపడి ఉండటానికి ఇష్టపడను. దాని వల్ల నాకు పోరాడే స్వేచ్ఛ ముగిసిపోతుంది’ అని పేర్కొన్నారు. విలేకరులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే అంగీకరిస్తారా? అని అడిగిన ప్రశ్నకు భాజపాకు చెందిన హేమ ఈ విధంగా సమాధానమిచ్చారు.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశిస్తూ హేమ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో భాజపా నేత యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. తన సినీ కెరీర్‌ వల్లే తనకు ఎంపీ అయ్యే అవకాశం వచ్చిందని, బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ‘డ్రీమ్‌ గర్ల్‌’గానే తాను చాలా మందికి తెలుసని హేమ అన్నారు. తాను పార్లమెంటుకు వెళ్లడానికి ముందే భాజపా కోసం చాలా పనిచేశానని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ రైతుల కోసం, మహిళలు, పేదల కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. అలాంటి ప్రధాని దొరకడం చాలా కష్టమని అన్నారు.

click me!