ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వేధింపులకు గురై, భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే సీఏఏ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే పౌరసత్వం పొందేందుకు వీలుగా దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం ఓ వైబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది.
పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దీని కోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఓ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవుల మత ప్రాతిపదికన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వేధింపులకు గురైన వ్యక్తులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (https://indiancitizenshiponline.nic.in) వెబ్ పోర్టల్ (https://indiancitizenshiponline.nic.in)ను ప్రారంభించింది.
పౌరసత్వ (సవరణ) చట్టం- 2019 నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫై చేయడంతో ఈ వెబ్ సైట్ నేటి నుంచి లైవ్ లోకి వచ్చింది. పౌరసత్వ (సవరణ) నిబంధనల ప్రకారం 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారతదేశంలో ఆశ్రయం పొందిన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పిస్తాయి.
కాగా.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను నియంత్రించే నిబంధనలను అమలు చేస్తున్నట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024 మార్చి 11 సోమవారం అధికారికంగా ప్రకటించింది. భారీ నిరసనల మధ్య 2019 లో పార్లమెంటు ఆమోదించిన సీఏఏ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో హింస నుండి పారిపోయి 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు మరియు క్రైస్తవులతో సహా ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఈ చట్టం ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అమల్లోకి రావడానికి ఆలస్యం అయ్యింది.
పౌరసత్వ (సవరణ) చట్టం 2019 (సీఏఏ-2019) కింద నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) సోమవారం నోటిఫై చేసింది. పౌరసత్వ (సవరణ) నిబంధనలు - 2024 సీఏఏ -2019 కింద అర్హులైన వ్యక్తులు భారత పౌరసత్వం మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. దీని కోసం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది. అయితే ఇందులో దరఖాస్తుదారులు ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన సంవత్సరాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.