
అక్టోబర్ 30న టాటా- ఎయిర్‌బస్ యాజమాన్యంలోని సీ295 సైనిక రవాణా విమానాలను తయారు చేసే కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా సైనిక రవాణా విమానాలను తయారు చేయగల సామర్ధ్యం వున్న డజను దేశాలున్న లీగ్‌లోకి ప్రవేశించనుంది.
మిలిటరీ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ కాంప్లెక్స్ అభివృద్ధి:
టాటా- ఎయిర్‌బస్ కాంబినేట్ సీ295 అనేది ప్రైవేట్ రంగంలో తొలి మేక్ ఇన్ ఇండియా ఏరోస్పేస్ ప్రోగ్రామ్. తయారీ నుంచి అసెంబ్లీ వరకు, టెస్టింగ్, ఎలిజబిలిటీ, డెలివరీ, నిర్వహణ వరకు అంతా ఈ కార్యక్రమంలో భాగం. 16 సీ295 విమానాలను సెప్టెంబర్ 2023 నుంచి ఆగస్ట్ 2025 మధ్య ఫ్లైవే కండీషన్‌లో డెలవరీ చేయాల్సి వుంటుంది. మిగిలిన 40 విమానాలను వడోదరా ఫెసిలిటీలో తయారు చేయనున్నారు.
విమానాలలో స్వదేశీ కంటెంట్ ఎన్నడూ లేని స్థాయిలో వినియోగించనున్నారు. స్పెయిన్‌లో ఎయిర్‌బస్ చేసే 96 శాతం పని ఇక్కడే చేయనున్నారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్‌ను దేశీయ ప్రైవేట్ రంగానికి సాంకేతికతతో కూడిన, అత్యంత పోటీతత్వ విమానయాన పరిశ్రమలోకి ప్రేవశించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఇది దేశీయ విమానయాన తయారీని పెంపొందిస్తుందని, ఫలితంగా దిగుతులపై ఆధారపడటం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. దీనితో పాటు 13,400 భాగాలు.. 4,600 సబ్ అసెంబ్లీలు, అన్ని ముఖ్యమైన కాంపోనెంట్ అసెంబ్లీలు ఏడు రాష్ట్రాల్లో విస్తరించి వున్న 25 దేశీయ ఎంఎస్ఎంఈ సరఫరాదారులచే తయారు చేయబడతాయి. ఈ 56 విమానాలకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ అమర్చబడి వుంటుంది.
సైనిక రవాణా విమానాల తయారీ సామర్థ్యం :
సీ295 విమానాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం వల్ల .. ఆ తరహా విమానాలను తయారు చేయగల సామర్ధ్యం వున్న 12వ దేశంగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం అమెరికా, జపాన్, యూకే, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, ఉక్రెయిన్, బ్రెజిల్, చైనా, జపాన్‌లు ఆ సామర్ధ్యాన్ని కలిగి వున్నాయి. అలైడ్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ పరిశ్రమ 2030 నాటికి 45 బిలియన్ల స్థాయికి చేరుకుంటుంది. టాటా- ఎయిర్‌బస్ ఫెసిలిటీ 2031 నాటికి ఐఏఎఫ్ లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు ఉత్పత్తులను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం వుంది.
పౌర విమానాల తయారీ సామర్థ్యం:
వాణిజ్య విమానాల కంటే సైనిక రవాణా విమానాల పరిశ్రమ చాలా పటిష్టమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన మెకానిజం కలిగి వుంది. సీ295 తయారీ దేశీయ వాణిజ్య విమానాల తయారీ అభివృద్ధికి అవకాశాలను తెరుస్తుంది. 2011 నుంచి 1100 ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఆర్డర్ బుక్‌తో కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల అతిపెద్ద కొనుగోలుదారులలో భారతీయ ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఒకటి. సీ295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సౌకర్యం, అనుబంధ సరఫరా గొలుసుతో పాటు వాణిజ్య విమానాల అభివృద్ధికి తోడ్పడే ఎకో సిస్టమ్‌ను భారతీయ తయారీ పరిశ్రమ అందించనుంది.
ఎక్స్‌పోర్ట్ పొటెన్షియల్ :
వడోదర ఫెసిలిటీ ప్రారంభంలో ఏడాదికి 8 విమానాలను తయారు చేయగల సామర్ధ్యంతో సిద్ధమవుతోంది. ఇదే సమయంలో భారతీయ సాయుధ బలగాలతో పాటు ఎగుమతుల అదనపు అవసరాలను కూడా తీర్చగలిగేలా రూపొందించబడింది. రక్షణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారత సాయుధ దళాలకు 56 విమానాలను డెలివరీ చేసిన తర్వాత, సివిల్ ఆపరేటర్‌లకు, ప్రభుత్వ అనుమతి పొందిన దేశాలకు సీ295 విమానాలను విక్రయించేందుకు అనుమతించనున్నారు. క్షిపణి ఎగుమతుల్లో బ్రహ్మోస్ సాధించిన విజయాన్ని వడోదర ఫెసిలిటీ ప్రతిబింబిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మేక్ ఇన్ ఇండియాకు పెద్ద ఊతం:
మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా భారతదేశం రక్షణ రంగంలో భారీ పరివర్తనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. క్షీపణులు, ఫీల్డ్ గన్‌లు, ట్యాంకులు, ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్‌లు, డ్రోన్‌లు , యుద్ధ విమానాలు, ట్యాంకులు, హెలికాఫ్టర్‌ల వంటి వివిధ రక్షణ ఫ్లాట్‌ఫామ్‌ల దేశీయ తయారీ కోసం అనేక ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. భారత సాయుధ దళాల రక్షణ ఆధునీకరణ అవసరాలను నెరవేరుస్తున్నాయి. అయితే సైనిక రవాణా విమానం మొత్తం రక్షణ పారిశ్రామిక కాంప్లెక్స్ చైన్‌లో కీలకమైంది. ఇప్పుడు టాటా, ఎయిర్‌బస్‌ల జాయింట్ వెంచర్ ఈ లోటును పూడ్చింది. ఇది మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని గణనీయంగా పెంచుతుంది. భారత సాయుధ దళాలు ఇకపై తమ రవాణా అవసరాల కోసం 1960 తరానికి చెందిన పాత అవ్రో విమానాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు.