
Assembly By-Elections: దేశంలోని ఆరు రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలకు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 23న ఉప ఎన్నికల పోలీంగ్.. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. పంజాబ్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీలో ఈ ఉప ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించడంతో హై-ప్రొఫైల్ సంగ్రూర్ ఎంపీ అయిన భగవంత్ మాన్ సింగ్ సీఎం అయ్యారు. దీంతో ఆ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. 2014లో తొలిసారి ఆప్ తరుఫున సంగ్రూర్ స్థానంలో ఎంపీగా గెలిచిన ఆయన 2019లో కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకుని లోక్‌సభలో ఆప్ ఏకైక ఎంపీగా నిలిచారు.
పంజాబ్‌లోని సంగ్రూర్, యూపీలోని రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ప్రకటించింది. భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగ్రూర్ సీటు ఖాళీ అయింది. అదే సమయంలో, ఆజం ఖాన్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాంపూర్ స్థానం ఖాళీ అయింది. అఖిలేష్ యాదవ్ అజంగఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆత్మకూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్ 23న ఉప ఎన్నిక జరగనున్నది. ఆ స్థానం వైసీపీ ఎమ్మెల్యే, పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 22న గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు. దీంతో ఆత్మకూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది
మరోవైపు, జూన్ 23న త్రిపురలోని అగర్తల, టౌన్ బోర్దోవలి, సుర్మా, జుబరాజ్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనున్నది. ఇది కాకుండా, ఢిల్లీలోని రాజేంద్ర నగర్, జార్ఖండ్‌లోని మాందారి మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక జరగనున్నది. రాఘవ్ చద్దా రాజీనామా చేయడంతో రాజేంద్ర నగర్ స్థానం ఖాళీ అయింది. రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తర్వాత చద్దా తన పదవికి రాజీనామా చేశారు. జూన్ 26న ఓట్ల లెక్కింపు నిర్వహించి మే 30న ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.