7 రాష్ట్రాలు, 13 అసెంబ్లీలు ...ఉప ఎన్నికల్లో ఇండియా కూటమిదే హవా

By Arun Kumar P  |  First Published Jul 13, 2024, 12:53 PM IST

లోక్ సభ ఎన్నికల తర్వాత బిజెపి న‌ేత‌ృత్వంలోని ఎన్డిఏ కూటమికి ఎదురుగాలి వీస్తోంది. ఇటీవల ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఇండియా కూటమి హవా సాగినట్లు తాజా ఫలితాలను బట్టి అర్థమవుతోంది.


లోక్ సభ ఎన్నికల తర్వాత వివిధ రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వివిధ కారణాలతో ఆయా స్ధానాల్లో ఎమ్మెల్యేలు వైదొలగగా ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇలా బిహార్, పశ్చిమ బెంగాల్,పంజాబ్, తమిళనాడ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు అసెంబ్లీలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇటీవలే పోలింగ్ ముగియగా తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.

లోక్ సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఎ మధ్య పోటీ నెలకొంది... అయితే అత్యధిక నియోజకవర్గాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే పంజాబ్ లోని జలంధర్ అసెంబ్లీ సీటును ఇండియా కూటమి గెలుచుకుంది. ఆమ్ ఆద్మి పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ 23 వేల మెజారిటీతో జలంధర్ పశ్చిమ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. 

Latest Videos

ఇక పశ్చిమ బెంగాల్  లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరిగింది. ఈ నాలుగు చోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఉపఎన్నికల్లోనూ బెంగాల్ ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా ఓటేసినట్లు కనిపిస్తోంది.  

ఇక హిమాచల్ ప్రదేశ్ లోనూ ఇండియా కూటమిదే పైచేయిగా నిలిచింది. రెండు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా...ఓ చోట బిజెపి ఆధిక్యంలో వుంది. హమీర్ పూర్ లో బిజెపి అభ్యర్థి ఆశిష్ శర్మ ఆధిక్యంలో వున్నారు. 

ఉత్తరాఖండ్  లోని భద్రినాథ్, మంగ్లార్ స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో వుంది.మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీలో డిఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ 10వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిహార్ లో జేడియు అభ్యర్థి  కళాధర్ ప్రసాద్ మండల్ ఆధిక్యంలో వున్నారు. 

click me!