ఢిల్లీ 11 మంది డెత్ మిస్టరీ: నెల రోజుల క్రితమే ప్రియాంక నిశ్చితార్ధం, అంతలోనే...

First Published Jul 2, 2018, 4:07 PM IST
Highlights

ఢిల్లీ  11 మంది డెత్ మిస్టరీ: మూఢ విశ్వాసం లేదు


న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని బురారి ప్రాంతంలో ఒక కుటుంబానికి చెందిన 11 మంది మరణించిన ఘటనపై బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా ఉన్నత విద్యావంతులని వారు గుర్తు చేస్తున్నారు. మూఢ నమ్మకాలను నమ్మే ప్రసక్తేలేదని బంధువు కేతన్ ‌నాగ్‌పాల్ అభిప్రాయపడ్డారు.మృతుల్లో ప్రియాంకకు గత నెలలోనే నిశ్చితార్ధం జరిగింది.ఈ ఏడాది చివర్లో జరగాల్సి ఉంది.కానీ, ఈలోపుగానే ఆమె మృత్యువాత పడింది.

 తమ కుటుంబానికి ఆర్థికపరమైన ఇబ్బందులేమీ లేవని ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇవి హత్యలు అయి ఉంటాయని అనుమానం వ్యక్తంచేశారు.  ఒకవేళ ఆత్మహత్యలు చేసుకుంటే ముఖాన్ని, నోటిని చేతులను కట్టేసుకునే వారు కాదు కదా అని ఆయన ప్రశ్నించారు.

అంతేకాదు శనివారం రాత్రి పూట తాను తమ కుటుంబసభ్యులతో మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకొనే పరిస్థితిలో ఉంటే తీవ్రమైన ఒత్తిడి కన్పించేదన్నారు. కానీ, తనతో మాట్లాడిన సమయంలో ఎలాంటి ఒత్తిడి లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మృతులు దేవుడిని నమ్ముతారని చెబుతూనే మూఢ నమ్మకాలను విశ్వసించేవారు కాదన్నారు.

ఒకేసారి ఒకే విధంగా చనిపోతే వారంతా దేవుని దగ్గరికి వెళ్తారని డైరీలో రాసి ఉందని పోలీసులు తెలిపారు. మృతుల కళ్లకు గంతలు చేతులు, నోరు కట్టేసి ఉన్నాయి. వీరి మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించగా నారాయణ్‌ దేవి అనే 77ఏళ్ల వృద్ధురాలి మృతదేహం మాత్రం నేలపై ఉంది.

ఉరేసుకొని మృతి చెందిన ప్రియాంక నిశ్చితార్థం గత నెలలోనే జరిగింది. ఈ ఏడాది చివరికి పెళ్లి జరగాల్సి ఉండగా.. ఈ దారుణం జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!