బురారి మరణాలు: దెయ్యాల కోసం స్మశానాల్లో దేవులాట

First Published Jul 7, 2018, 9:11 AM IST
Highlights

దెయ్యాలపై, ఆత్మలపై ఆసక్తి పెంచుకున్న లలిత్ భాటియా స్మశానాల్లో దేవులాడేవాడని క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో తేలింది. మృతుల్లో లలిత్ భాటియా కూడా ఉన్న విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్యల కేసులో మరో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగు చూసింది. గత నెల 30వ తేదీన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది తమ ఇంట్లో శవాలై తేలిన విషయం తెలిసిందే. దెయ్యాలపై, ఆత్మలపై ఆసక్తి పెంచుకున్న లలిత్ భాటియా స్మశానాల్లో దేవులాడేవాడని క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో తేలింది. 

మృతుల్లో లలిత్ భాటియా కూడా ఉన్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులందరినీ తన మూఢనమ్మకాలతో ఆయనే సామూహిక ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లు తేలిన విషయం విదితమే.

సంత్ నగర్ లోని ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఓ రిజిష్టర్ ద్వారా లలిత్ స్మశానాల్లో సంచరించేవాడని తెలిసింది. రిజిస్టర్ లో రాత ప్రియాంకదని తేలింది. ప్రియాంక ఫేస్ బుక్ లో దెయ్యాలు, ఆధ్యాత్మిక విషయాల గురించి రాసిన వార్తాకథనాల పేజ్ లను, జ్యోతిషం, ప్రేరణఇచ్చే ఆలోచనలతో గల పేజ్ లను ఇష్టపడేదని దర్యాప్తులో తేలింది. 

యూట్యూబ్, ఇతర ఇంటర్నెట్ వేదికలపై లలిత్ దెయ్యాలు, ఇతర మార్మిక విషయాల గురించిన వీడియోలను  మొబైల్ లో చూడడంతో పాటు లలిత్ మరణ రహస్యం గురించి, ఆత్మకు సంబంధించి మర్మాల గురించి పరిశోధనలు చేశాడని దర్యాప్తులో వెల్లడైంది.

లలిత్ భార్య టీనా కుటుంబ సభ్యులను విచారించడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసు బృందం రాజస్థాన్ లోని ఉదయపూర్ వెళ్లింది. టీనా కూడా మరణించిన 11 మందిలో ఉన్న విషయం తెలిసిందే. తన అత్తారింట జరుగుతున్న వ్యవహారాల గురించి టీనా తన కుటుంబ సభ్యులకు ఏమైనా చెప్పిందా అనే విషయంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీశారు. 

జూన్ 16వ తేదీన ప్రియాంక నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో జూన్ 14వ తేదీ నుంచి సంత్ నగర్ నివాసంలో ఉన్న 13 మంది లలిత్ బంధువుల వాంగ్మూలాలను సేకరించారు. లలిత్ సామూహిక ఆత్మహత్యల క్రియను జూన్ 24వ తేదీన ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

కుటుంబంతో సంబంధాలు నెరిపిన గీతా మాకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్లిన్ చిట్ ఇచ్చారు. మనోవైకల్యం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు.

click me!