
KJ Alphons: ఉపాధి కల్పించే వారిని దూషించే బదులు గౌరవించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కేజే ఆల్ఫోన్స్ అన్నారు. మనదేశంలో ఉద్యోగాలను సృష్టిస్తున్న అంబానీ, ఆదానీ వంటి పారిశ్రామికవేత్తలను పూజించాలని గురువారం కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎంపీ కెజె అల్ఫోన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎంపీ కెజె అల్ఫోన్స్ శుక్రవారం వివరణ ఇచ్చారు,
ప్రైవేట్ రంగంలోనే ఉపాధి మార్గాలు ఎక్కువగా ఉన్నాయనీ, ఉపాధిని కల్పిస్తున్న వ్యాపారవేత్తలను గౌరవించాలని అన్నారు. మన దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు ఎవరు సృష్టిస్తారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగ,ఉపాధి కల్పన చాలా తక్కువ. అదే ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన చాలా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ఉద్యోగాలను సృష్టించేవారిని గౌరవించాలని ఎంపీ అల్ఫోన్స్ అన్నారు. అస్పష్టమైన సోషలిజం పేరుతో ప్రైవేట్ రంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు.
మన దేశంలో ఉద్యోగాలను సృష్టించేవారిని మనం గౌరవించాలన్నారు. వారి పేర్లను ప్రతిపక్షాలు చెప్తున్నాయి. కాబట్టి తాను కూడా చెబుతానన్నారు. రిలయన్స్ అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వేరొకరు ఎవరైనా సరే, వారిని మనం పూజించాలి, ఎందుకంటే, పెట్టుబడి పెట్టి.. పారిశ్రామికవేత్తలు ఉద్యోగాలు సృష్టిస్తారు. ఉద్యోగాలు ఇస్తున్నారన్నారు.
మనదేశంలో ఇద్దరి సంపద పెరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయని, కానీ ప్రపంచవ్యాప్తంగా అసమానతలు ఉన్నాయని అది వాస్తవమని అన్నారు. ఎలన్ మస్క్ సంపద 1,016 శాతం పెరిగింది గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ సంపద 126 శాతం పెరిగింది. బెజోస్ సంపద 67 శాతం పెరిగింది.వీరితో పాటు ఈ టాప్ 10లో బిల్ గేట్స్ కూడా ఉన్నారు. అతని సంపద 30 శాతం పెరిగిందని వివరించారు. మీరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. ప్రపంచ అసమానత వాస్తవం. ప్రపంచంలో మూడు బిలియన్ల మంది ప్రజల రోజువారి సంపదన ఐదు డాలర్ల కంటే తక్కువ ఉంది. కాబట్టే.. ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు ఉన్నాయని తెలిపారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్‌పై ఆర్‌జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ను అమృత్ కల్ కా బడ్జెట్‌గా అభివర్ణించిందని అన్నారు. కానీ, గత కొన్నేళ్లుగా ఈ ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నానని చెప్పారు. ఎవరికి అమృతం దొరుకుతుందో, ఎవరికి విషం వస్తుందో స్పష్టమవుతుందని అన్నారు. అమృతం స్నేహితుల కోసం తగినంతగా సరఫరా చేయబడిందని, చాలా మంది ప్రజలు విషాన్ని మాత్రమే పొందుతున్నారు. ప్రభుత్వం ఉపాధి కల్పనపై దృష్టి సారించడం లేదని, ప్రభుత్వం ఎంప్లాయ్‌మెంట్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతలో ఓపిక నశించిందన్నారు.