
UP Assembly Election 2022: ఈ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో గురువారం తొలి దశ పోలింగ్ ప్రారంభం కాగా, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో మొదటిదశ ఎన్నికలు పూర్తయిన క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రంలో మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తుంది.
అయితే, ఉత్తరప్రదేశ్ మొదటిదశ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజునే... సాగు చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కాన్వాయ్ ని పొనిచ్చి.. 8 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన లఖింపూర్ ఖేరీ ఘటన ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. సరిగ్గా ఉత్తరప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ రోజునే ఈ బెయిల్ రావడంతో విమర్శలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే అఖిలేష్ యాదవ్ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తుడిచిపెట్టుకుపోతుందనే సంకేతాలను అందించిందని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ హింస నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ అంశాన్ని సైతం అఖిలేష్ యాదవ్ ప్రస్తావించారు. బీజేపీని రైతులు ఎప్పటికీ క్షమించరని అన్నారు. ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజమ్ తప్పుడు కేసులపై రెండేళ్లపాటు జైలులో ఉండాల్సి వచ్చిందని ఆయన అన్నారు."అజామ్ ఖాన్ ను కూడా తప్పుడు ఆరోపణలపై జైలుకు పంపారు. గేదెదొంగతనం, కోడి దొంగతనం, పుస్తకాల దొంగతనం కేసులు అతనిపై నమోదు చేయబడ్డాయి. కారుతో ఢీ కొట్టి.. రైతులపై నుంచి కారు పొనిచ్చిన వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇది బీజేపీ (కాషాయం) కొత్త భారత దేశం" అంటూ ఆరోపించారు.
‘‘మీ కోసం యూనివర్శిటీ కట్టి, మీ హక్కులు, గౌరవం కోసం పోరాడిన వ్యక్తిని జైలుకు పంపారు.. జీపుతో రైతులను చంపిని వ్యక్తిని జైలు నుంచి బయటకు పంపించారు. ప్రపంచంలో ఎక్కడా రైతులను జీపుతో ఢీ కొట్టి చంపలేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఇక్కడ ఉన్నందున, అతను బెయిల్ పొంది బయట ఉన్నాడు”అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కాగా, అజంఖాన్ రాంపూర్‌లో జౌహర్ విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆయన వివిధ ఆరోపణలపై సీతాపూర్ జైలులో ఉన్నారు. ఎస్పీ ఖాన్‌ను రాంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి, ఆయన కుమారుడిని జిల్లాలోని సువార్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. రాంపూర్‌లో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది.