ఢిల్లీలో కూలిపోయిన నాలుగంతస్తుల బిల్డింగ్.. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్, పోలీసులు

By telugu teamFirst Published Sep 13, 2021, 3:38 PM IST
Highlights

ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం నేలమట్టమయింది. ఈ శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు బాలురను వెలికి తీసి హాస్పిటల్‌ తరలించగా, వారు అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మరో వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. సహాయక పనులను పర్యవేక్షిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
 

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. మల్కాగంజ్‌లోని సబ్జీ మండి సమీపంలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్టుండి నేలకూలింది. అటుగా వెళ్తున్న ఇద్దరు చిన్నపిల్లలు ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇంకొందరు ఆ శిథిలాల కిదే ఇరుక్కుని ఉంటారన్న అనుమానాలున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ ఫైర్ సర్వీస్‌(డీఎఫ్ఎస్)కు ఉదయం 11.50 గంటల ప్రాంతంలో కాల్ వెళ్లింది. వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్‌లను, తర్వాత మరో రెండు అగ్నిమాపక వాహనాలను డీఎఫ్ఎస్ పంపింది.

స్థానిక పోలీసులు, ఎంసీడీ, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే సహాయక చర్యల్లోకి దిగాయి. ఈ శిథిలా కింది నుంచి కొన్ని గంటల తర్వాత ఇద్దరు బాలురను బయటికి తీశారు. వెంటనే వారిని సమీపంలోని బడా హిందూ రావ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆ చిన్నారులు మరణించినట్టు వైద్యులు తెలిపారు. కాగా, మరో వ్యక్తిని ఈ శిథిలాల నుంచి సహాయక సిబ్బందికి వెలికి తీసింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పరిస్థితులను పరిశీలిస్తున్నారని వివరించారు. సబ్జి మండీ సమీపంలోని భవనం కూలిపోయిన ఘటన బాధాకరమని తెలిపారు. అధికారులు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారని, వారితోపాటు తానూ సహాయక పనులను పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. కొన్ని రోజుల నుంచి కుండపోతగా పడుతున్న వర్షాలతో భవనం పునాదులు బలహీనపడి ఉండవచ్చని, దాని ఫలితంగా భవనం కూలిపోయి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

click me!