
ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ కు చెందిన బీజేపీ నేత అనూజ్ చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. మొరాదాబాద్ లోని ఆయన నివాసం వెలుపల గురువారం సాయంత్రం పలువురు దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
వివరాలు ఇలా ఉన్నాయి. 34 ఏళ్ల అనూజ్ చౌదరి మరో వ్యక్తితో కలిసి అపార్ట్ మెంట్ వెలుపల గురువారం సాయంత్రం నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు చౌదరిని మొరాదాబాద్ బ్రైట్ స్టార్ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే తీవ్రగాయాలతో ఉన్న ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. కాగా.. ఆయన అపార్ట్ మెంట్ వెలుపల నడుచుకుంటూ వెళ్లడం, దుండగులు వచ్చి కాల్పులు జరపడం, చౌదరి అక్కడికక్కడే కుప్పకూలిపోవడం సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన చౌదరి.. బ్లాక్ చీఫ్ ఎన్నికల్లో సంభాల్ లోని అస్మోలి బ్లాక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే
ఈ హత్యకు రాజకీయ ప్రత్యర్థులే కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. అమిత్ చౌదరి, అనికేత్ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రెండు వర్గాల మధ్య వ్యక్తిగత వైరంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి, వారిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్టు మొరాదాబాద్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వాంటెడ్ నిందితుడిని త్వరలోనే అరెస్టు చేసిన తర్వాత చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.