ఆన్‌లైన్ క్లాసులకు నెట్‌వర్క్ వెతుక్కుంటూ అనంతలోకాలకు..

By telugu teamFirst Published Aug 19, 2021, 1:39 PM IST
Highlights

ఆన్‌లైన్ క్లాసుకు హాజరవ్వడానికి నెట్‌వర్క్ వెతుక్కుంటూ వెళ్లిన 13ఏళ్ల బాలుడు ఓ బండరాయి పై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. కటిక పేదరికం అనుభవిస్తున్న ఆ కుటుంబం పిల్లాడి చదువు కోసం ఇటీవలే స్మార్ట్ ఫోన్ కొనింది. కానీ, నెట్‌వర్క్ అందక ఏడో తరగతి విద్యార్థి అదిరా తన ప్రాణాలమీదికే తెచ్చుకున్నాడు. ఈ ఘటన ఒడిశాల మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

భువనేశ్వర్: కరోనా మహమ్మారి ప్రజల జీవన శైలినే మార్చేసింది. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి అనేక పార్శ్వాల్లో మార్పులు వచ్చాయి. విద్యార్థుల చదువుల్లోనూ పెనుమార్పులు సంభవించాయి. గాలిద్వారా సోకే వైరస్ కావడంతో ప్రభుత్వాలు ప్రత్యక్ష తరగతులకు స్వస్తి పలికాయి. ఆన్‌లైన్ మార్గంలో ఇంటి నుంచే విద్యార్థులు తరగతులకు హాజరయ్యే సౌకర్యాన్ని తెచ్చాయి. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ లేమి విద్యార్థులకు శాపంగా మారింది. ఒడిశాలోని ఓ గ్రామంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం నెట్‌వర్క్ వెతుక్కుంటూ సమీపంలోని కొండ ప్రాంతానికి వెళ్లిన 13ఏళ్ల బాలుడు కాలు జారి ప్రాణాలు కోల్పోయాడు.

కటక్‌లోని మిషనరీ స్కూల్‌లో 13ఏళ్ల పిల్లాడు ఆండ్రియా జగరంగా ఏడో తరగతి చదివుతున్నాడు. మహమ్మారి విజృంభించడంతో స్వగ్రామం రాయగడ జిల్లాలోని పంద్రగూడకు తిరిగివచ్చాడు. ఆ గ్రామంలో నెట్‌వర్క్ కనెక్టివిటీ స్వల్పంగా ఉన్నది. అందువల్ల ఆన్‌లైన్ క్లాసుల కోసం నెట్‌వర్క్ వెతుక్కుంటూ సమీపంలోని కొండప్రాంతాలనెక్కేవాడు. కానీ, గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో బండలు జారుడు స్వభావాన్ని సంతరించుకున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆన్‌లైన్ క్లాసు వింటుండగా గగరండా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నెట్‌వర్క్ కోసం వెతుకుతుండగా ఓ గుండపై వేసిన కాలు జారిపోయింది. బ్యాలెన్స్ అదుపుతప్పడంతో వచ్చి నేలపై పడ్డాడు. తీవ్రగాయాలపాలయ్యాడు.

అతడిని వెంటనే పద్మాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అందిస్తున్నా ఆయన పరిస్థితి విషమంగా మారింది. దీంతో బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అదే హాస్పిటల్‌లో చికిత్సపొందుతుండగానే పరిస్థితులు విషమించి ఆండ్రియా తుదిశ్వాస విడిచాడు. ఆండ్రియా జగరంగా కుటుంబీకులు గుండెలవిసేలా ఏడ్చారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.

ఆండ్రియా తండ్రి నరహరి జగరంగా మాట్లాడుతూ, ‘మంగళవారం సాయంత్రం ఓ గుండుపై నుంచి ఆండ్రియా జారిపడ్డాడు. ఓ బండరాయి అతని కాలును తుక్కు చేసింది. మేం ఆయనను చూసే సరికే ఆండ్రియా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. శ్వాస మాత్రం తీస్తున్నాడు. వెంటనే సమీపంలోని హా్స్పిటల్‌కు తీసుకెళ్లాం. కానీ, చికిత్స పొందుతూనే మరణించాడు’ అని వివరించాడు.

ఆండ్రియా కుటుంబం కటికపేదరికం అనుభవిస్తున్నది. అదిర తండ్రి నరహరి నెల సంపాదన రూ. 2000. కొడుకు ఆండ్రియాకు స్మార్ట్ ఫోన్ అందించే తాహతు లేదు. ఆండ్రియా అన్నయ్య ఆన్‌లైన్ క్లాసుల కోసం ఇటీవలే సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. కానీ, ఆన్‌లైన్ క్లాసులకు నెట్‌వర్క్ వెతుక్కుంటూ ఆయన అనంతలోకాలకు వెళ్లాడని స్థానికులు కన్నీటి సంద్రంలో మునిగారు.

click me!