
భారత్-మయన్మార్ సరిహద్దులను (india myanmar border) మూసివేసేందుకు కంచె వేసే పనులను వేగవంతం చేస్తామన్నారు మణిపూర్ ముఖ్యమంత్రి (manipur chief minister) ఎన్ బిరేన్ సింగ్ (biren singh) . మయన్మార్-మణిపూర్ మధ్య 398 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉందని... ఇతరులు దేశంలోకి చొరబడటానికి అవకాశంగల ప్రాంతాల్లో కంచె నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించామని ముఖ్యమంత్రి చెప్పారు.
మయన్మార్ నుంచి ఉగ్రవాదులు మణిపూర్‌లోకి ప్రవేశించి, చురాచంద్‌పూర్ జిల్లాలో (Suraj Chand district) అస్సాం రైఫిల్స్ (Assam Rifles) కాన్వాయ్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో కమాండింగ్ ఆఫీసర్ కుటుంబంతో పాటు నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన ఆరుగురు ఇంఫాల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని బిరేన్ సింగ్ ఆదివారం పరామర్శించారు.
ALso Read:మణిపూర్: అసోం రైఫిల్స్‌పై ఉగ్రవాదుల మెరుపుదాడి .. ఆఫీసర్ కుటుంబం సహా నలుగురు సైనికులు మృతి..?
అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. చొరబాటుదారులకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పటిష్టమైన కంచెను నిర్మించే పనులను వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరిహద్దుల్లో కంచెను నిర్మించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. 40 కిలోమీటర్ల మేరకు కంచె నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. కొన్ని చోట్ల వివాదాల వల్ల ఈ పనులను ఆపినట్లు సీఎం తెలిపారు. ఉగ్రవాద చర్యలను మణిపూర్ ప్రభుత్వం సహించబోదని చెప్పారు.