‘సింగం’వంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరం: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

By Rajesh Karampoori  |  First Published Sep 23, 2023, 7:21 AM IST

‘సింగం’వంటి సినిమాల్లో చూపించినట్లుగా న్యాయ ప్రక్రియతో సంబంధం లేకుండా సత్వర న్యాయం అందించే పోలీసు సినిమాలు చాలా ప్రమాదకరమైన సందేశాన్ని అందిస్తాయని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ పేర్కొన్నారు. 


"సింగం" వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో చూపిన విధంగా న్యాయ ప్రక్రియ గురించి పట్టించుకోకుండా సత్వర న్యాయం అందించే  పోలీసు సినిమాలు చాలా హానికరమైన సందేశాన్ని పంపుతుందని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అన్నారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షిక దినోత్సవం, పోలీసు సంస్కరణల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో జస్టిస్ గౌతమ్ పటేల్ మాట్లాడుతూ.. చట్ట ప్రక్రియపై ప్రజల అసహనాన్ని కూడా ప్రశ్నించారు.

పోలీసు సంస్కరణల గురించి మాట్లాడుతూ.. మనల్ని మనం సంస్కరించుకుంటే తప్ప చట్ట అమలు యంత్రాంగాన్ని సంస్కరించలేమని న్యాయమూర్తి అన్నారు. పోలీసులను రౌడీలుగా, అవినీతిపరులుగా, బాధ్యతారాహిత్యంగా చూపించే చిత్రాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో సహా ఇతరుల గురించి కూడా  అలాగే చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు తమ పని చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు.. పోలీసుల చర్యలనే స్వాగతిస్తారని న్యాయమూర్తి అన్నారు. అందుకే రేప్ నిందితులను నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపబడినప్పుడు.. ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, సంబరాలు కూడా చేసుకుంటారని అన్నారు. అసలూ తమకు న్యాయం జరిగిందని భావిస్తున్నా.. ఇక్కడ న్యాయం జరిగిందా? అని ప్రశ్నించారు.

Latest Videos

సినిమాలు మనల్నీ చాలా ప్రభావితం చేస్తాయని, అవి చాలా బలంగా ప్రతిబింబిస్తాయని జస్టిస్ పటేల్ పేర్కొన్నారు. సినిమాల్లో న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను చాలా తక్కువ చేసి చూపిస్తున్నారనీ, పోలీసులే ఒంటరిగా న్యాయం చేసేవాళ్లగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ పటేల్  ఇంకా మాట్లాడుతూ.. సింగం చిత్రం క్లైమాక్స్‌లో.. ప్రకాష్ రాజ్ పోషించిన రాజకీయ నాయకుడిపై మొత్తం పోలీసు బలగాలు తిరగబడినట్టు, దానితో  న్యాయం జరిగినట్లు చూపించారు. కానీ, అక్కడ అసలైన న్యాయం జరిగిందా? ఆ సందేశం ఎంత ప్రమాదకరమో ఆలోచించారా? అని ప్రశ్నించారు.  

సత్వరమార్గాలకు అనుకూలంగా ఈ ప్రక్రియను విరమించినట్లయితే..న్యాయ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని జస్టిస్ పటేల్ అన్నారు. పోలీసు సంస్కరణలను ఒంటరిగా చూడలేమని, ఇతర ముఖ్యమైన సంస్కరణలు అవసరమని జస్టిస్ పటేల్ అన్నారు. పోలీసు యంత్రాంగం పనితీరులో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ సింగ్ -- పోలీసు సంస్కరణలను సాకారం చేయడంలో ఆయన అలుపెరగని, అవిశ్రాంతంగా కృషి చేశారని న్యాయమూర్తి అన్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం సింగం (2011). తమిళ చిత్రానికి రీమేక్. ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో పోలీసు అధికారిగా నటించారు.
 

click me!