చందా కొచ్చర్ దంపతులకు ఊరట.. అరెస్ట్ చట్టానికి అనుగుణంగా లేదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Jan 9, 2023, 1:32 PM IST
Highlights

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. వారి అరెస్టు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. వారి అరెస్టు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదని న్యాయమూర్తులు జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పీకే చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. వారికి బెయిల్ కూడా మంజూరు చేసింది. చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌ను అరెస్టు.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41A ఉల్లంఘన జరిగిందని తెలిపింది. ఇక, వీడియోకాన్-ఐసీఐసీఐ  బ్యాంక్ రుణం కేసుకు సంబంధించి ఈ జంటను 2022 డిసెంబర్ 23న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. వారు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఈ కేసులో కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే తమను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను సీబీఐ అరెస్టు చేయడం ఏకపక్షం, చట్టవిరుద్ధమని వీరిద్దరూ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నేడు బాంబే హైకోర్టులో విచారణలో జరిగింది. 

‘‘వాస్తవాల ప్రకారం.. పిటిషనర్ల అరెస్టు చట్ట నిబంధనల ప్రకారం జరగలేదు. సెక్షన్ 41 (ఏ)ని పాటించకపోవడం వల్ల వారి విడుదలకు హామీ ఇవ్వబడింది. అరెస్ట్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా లేదు’’అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. వారికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..  ఒక్కొక్కరికీ లక్ష రూపాయల నగదు జమ చేయాలని ఆదేశించింది. వీరిద్దరూ విచారణకు సహకరించాలని, సమన్లు వచ్చినప్పుడు సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే వారు పాస్‌పోర్టులను సీబీఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

click me!