
కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్‌ఎస్) కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్ జిల్లాలోని పయ్యన్నూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఆర్ఎస్‌ఎస్ కార్యాలయం కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ బాంబు దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
అదే సమయంలో ఈ దాడికి కారణమైన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే నగరంలోని ప్రైవేటు సంస్థల నుంచి సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా సేకరిస్తున్నారు. అయితే కొందరు బైక్‌లపై వచ్చి ఈ దాడికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు ఈ దాడికి నిరసనగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పయ్యన్నూరు పట్టణంలో ఉదయం పాదయాత్ర చేపట్టారు. దాడి వెనుక సీపీ(ఎం) హస్తం ఉందని స్థానిక ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు ఆరోపించారు.