అయోధ్యలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకునేందుకు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సిద్దమయ్యారు. ఇందుకోసం సరయూ నది తీరంలో ఇంటి స్థలం తీసుకున్నారు.
అయోధ్య : శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణం జరిగింది. అద్భుత శిల్పకళాసంపదకు అధునిక అందాలు జోడించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించాలని దేశంలోని మెజారటీ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయితే ఏకంగా అయోధ్యలోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుంటున్నారు. సరయు నది ఒడ్డున ఏర్పాటుచేసిన ఎన్ క్లేవ్ లో అమితాబ్ ప్లాట్ కొనుగోలు చేసినట్లు రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది.
అయోధ్య రామమందిరంను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 22న ప్రారంభించనున్నారు. రామాలయం నిర్మాణంతో అయోధ్యలో ఆధ్యాత్మిక పర్యాటకం మరింతగా పెరగనుంది. దీన్ని గుర్తించిన ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ది హౌజ్ ఆఫ్ అభినందన్ లోధా సరయు నది తీరంలో 51 ఎకరాల విస్తీర్ణంలో ఇంటి స్థలాలు ఏర్పాటుచేసింది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా ప్లాట్ తీసుకున్నట్లు సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటించింది.
అమితాబ్ బచ్చన్ ప్లాట్ కొనుగోలుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు రియల్ ఎస్టేట్ సంస్థ అంగీకరించలేదు. తమ కస్టమర్లకు సంబంధించిన వివరాలను గోప్యంగా వుంచుతామని... అందువల్లే అమితాబ్ బచ్చన్ ఇంటి స్థలం ఎక్కడ? విస్తీర్ణం ఎంత? విలువెంత? తదితర వివరాలను వెల్లడించడం లేదని రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు అమితాబ్ 10వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలాన్ని రూ.14.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read 14 లక్షల దీపాల కాంతుల్లో... ధేధీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య రామయ్య
అమితాబ్ పుట్టిపెరిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే అయోధ్య రామమందిరం నిర్మించారు. ఆయన స్వస్థలం అలహాబాద్ (ప్రయాగరాజ్) నుండి అయోధ్యకు రోడ్డుమార్గంలో నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. ఇలా తన స్వస్థలానికి దగ్గర్లో వున్నట్లు వుంటుంది... అలాగే దైవ సన్నిధిలో వున్నట్లు వుటుందనే అమితాబ్ అయోధ్యలో ఇళ్లు కట్టుకోవాలని చూస్తున్నట్లున్నాడు.
నూతనంగా నిర్మించిన రామమందిరానికి కేవలం 15 నిమిషాల్లో, విమానాశ్రయానికి 30 నిమిషాల్లో చేరుకునేలా అమితాబ్ కొనుగులు చేసిన స్థలం వుందని రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ తెలిపారు. తమ ప్రాజెక్ట్ లో అమితాబ్ ఇంటిస్థలం కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అమితాబ్ బాటలోనే మరికొందరు ప్రముఖులు కూడా నడిచే అవకాశాలున్నాయని... ఆద్యాత్మిక నగరం అయోధ్యలో సొంతింటి కలను నెరవేర్చుకుంటారని అన్నారు.