ప్రియాంక గాంధీ దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణల నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమె కర్ణాటకలోని కొప్పాల్ నుంచి, తెలంగాణలోని ఓ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనుందని కొన్ని వర్గాలు తెలిపాయి.
Priyanka Gandhi: కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ దక్షిణాది రాష్ట్రాల నుంచి రెండు స్థానాల్లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలిసింది. స్థానిక కాంగ్రెస్ యూనిట్లకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఏఐసీసీ సర్వేలు చేయించుకుందనీ, ఆ సర్వేల ఫలితాలు కూడా వచ్చినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని కొప్పల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి, తెలంగాణలోని ఓ లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయని ఆ సర్వేలు పేర్కొన్నట్టు సమాచారం.
కర్ణాటకలో కొప్పాల్ లోక్ సభ స్థానం వెనుకబడిన ప్రాంతానికి చెందినది. ఈ పార్లమెంటు స్థానంలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఎనిమిదింటిలో ఆరు కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రస్తుతం కొప్పాల్ లోక్ సభ నియోజకవర్గానికి బీజేపీ నేత కరాడి సంగన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ అగ్ర నేతలు కూడా దక్షిణాది నుంచి పోటీ చేసి తమ రాజకీయ ప్రస్థానాన్ని పునరుజ్జీవనం చేసుకున్నారు. 1978లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కర్ణాటకలోని చిక్కమగూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఈ స్థానాన్ని ఉడుపి-చిక్కమగలూరు అని పిలుస్తారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1999లో కర్ణాటకలోని బళ్లారి నుంచి సోనియా గాంధీ గెలిచారు. అప్పుడు బీజేపీ నేత సుష్మా స్వరాజ్‌ను ఆమె ఓడించారు.
Also Read: రాహుల్ గాంధీని రీలాంచ్ చేసేందుకే భారత్ జోడో న్యాయ్ యాత్ర - బీజేపీ
ప్రియాంక గాంధీ కర్ణాటక నుంచి పోటీ చేస్తే ఆ పోటీ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. బీజేపీపై బలంగా పోరాడటానికి కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేయడానికి ఆమె పోటీ ఉపకరిస్తుందని విశ్లేషిస్తున్నారు.