
భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ప్రమాదం జరిగింది. సింధు నది(Sindh River)లో పది మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ (Boat) ప్రమాదవశాత్తు నదిలో మునిగింది. భీండ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఎనిమిది మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగలిగారు. కానీ, ఇప్పటికీ ఇద్దరు చిన్నారుల ఆచూకీ లభించడం లేదు. వారి కోసం గాలింపులు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భీండ్ జిల్లా సింధు నదికి అవతలి గట్టుపై ఒక మతపరమైన వేడుక కోసం ప్రజలు పడవపై వెళ్లి పోయారు. అక్కడ ఆ వేడుక ముగిసిన తర్వాత అదే పడవపై తిరుగు ప్రయాణానికి బయల్దేరారు. అంతా సవ్యంగానే సాగుతుండగా.. ఈ గట్టుకు మరికొద్ది సేపట్లో చేరే సందర్భంలో ప్రమాదం జరిగింది. చేరాల్సిన గట్టుకు కొన్ని మీటర్ల దూరంలోనే ప్రమాదం మునకేసింది. దీంతో దానిపై ఉన్న ప్రయాణికులు నీటిలో మునిగారు. ఒక్కొక్కరు ఒక్కో చోట నీటిలో తేలియాడుతూ.. కొట్టుమిట్టాడారు. కొన్ని నిమిషాల పాటు అక్కడి వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారింది.
ఈ ఘటనను ఒడ్డుపై ఉన్న కొందరు వీడియో తీశారు. పడవ వస్తుందనగా వీడియో తీశారు. కానీ, ఆ పడవ ప్రమాదవశాత్తు మునిగింది. దాంతో ప్రయాణికులూ నీటిలో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు కనిపించాయి. కొందరేమో ఈదుతూ ఒడ్డు చేరే ప్రయత్నాలు చేశారు. కాగా, ఒడ్డుపై ఉన్న కొందరు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. ఆ నదిలో దూకి ఎదురుగా ఈదుతూ వెళ్లిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
భీండ్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగినట్టు నయాగావ్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేంద్ర సింగ్ కుష్వాహా వెల్లడించారు. ఆ పడవలో పది మంది ప్రయాణించగా.. ఇద్దరు మిస్సింగ్ అయ్యారని తెలిపారు. ఆ ఇద్దరూ టీనేజ్‌లో ఉన్న చిన్నారులే. 16 ఏళ్ల ద్రౌపతి బగేల్, 13 ఏళ్ల ఓం బగేల్ ఈ ఘటనలో మునిగిపోయారు. వీరిద్దరి ఆచూకి ఇంకా తెలియరాలేదు. వీరిద్దరూ ఉత్తరప్రదశ్‌కు చెందిన మీర్జాపూర్ వాస్తవ్యులు అని ఇన్‌స్పెక్టర్ నరేంద్ర సింగ్ కుష్వాహా తెలిపారు.
కాగా, మధ్యాసియా నుంచి గత నెల శరణార్థులను మోసుకెళ్తున్న ఓ పడవ గ్రీస్ సమీపంలో మునిగిపోయింది. గ్రీస్ సమీపంలో గురువారం సాయత్రం పడవ నీటిలో మునిగిపోయింది. అంటికైతెరా ద్వీపానికి ఉత్తరాన ఓ చిన్న ద్వీపం దగ్గర మునిగింది. పడవ నీటి అడుక్కు వెళ్లిపోయింది. కాగా, కొందరు ఆ చిన్న ద్వీపాన్ని అందుకోగలిగారు. కాగా, గురువారం రాత్రి ఆ చిన్ని ద్వీపంపైనే చిక్కుకుపోయారు. మరికొందరు సముద్ర జలాల్లో తప్పిపోయారు. గ్రీసు తీర గస్తీ దళాలకు ఈ విషయం తెలిసింది. వెంటనే మునిగిన వారి కోసం గాలింపులు జరిపారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను కనుగొనగలిగారు. చిన్న ద్వీపంపై చిక్కుకున్న 90 మందినీ అధికారులు కాపాడగలిగారు .అందులో 27 మంది చిన్నారులున్నారు. 11 మంది మహిళలు, 52 మంది పురుషులు ఉన్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తీసుకు రాగలిగారు. అయితే, ఆ పడవపై ఎంత మంది ప్రయాణం చేస్తున్నారు అనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికైతే 11 మంది మృత దేహలను అధికారులు వెలికి తీయగలిగారు. ఈ సంఖ్యపై స్పష్టత లేనందున గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.