
చెన్నై: సీఆర్‌పీఎఫ్ ఉద్యోగ నియామాకాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలను హిందీ, ఇంగ్లీష్ లలో మాత్రమే నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నిరసన వ్యక్తం చేవారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదివారంనాడు లేఖ రాశారు. 'సీఆర్‌పీఎఫ్ పరీక్షను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించాలని నిర్ణయించడం ఏకపక్షమని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తమిళనాడుకు చెందిన ఒక్క అభ్యర్ధి కూడా పరీక్ష రాయకుండా అడ్డుకుందని ఆ లేఖలో ఆయన చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్దమని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఆర్‌పీఎఫ్ లో 9,212 పోస్టులను భర్తీ చేయనుంది కేంద్రం.,ఇందులో తమిళనాడు రాష్ట్రంలో 579 పోస్టులు భర్తీ చేయాలి. ఈ పరీక్షల నిర్వహణకు 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సీఆర్‌పీఎఫ్ పరీక్షకు సంబంధించి నిబంధనలు హిందీ చదివిన అభ్యర్ధులకు ప్రయోజనం కలిగించేలా ఉన్నాయని కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు.ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించే తమిళనాడుకు చెందిన అభ్యర్ధులకు ఇది ఆశనిపాతంగా ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో తమిళంతో సహా ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేలా కేంద్ర మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని స్టాలిన్ కోరారు.
ఉద్దేశ్యపూర్వకంగా హిందీ భాషను తమ రాష్ట్రంలో రుద్దడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . అవకాశం వచ్చినప్పుడల్లా ఈ విషయమై స్టాలిన్ కేంద్రం తీరును తప్పుబడుతున్నారు. హిందీ భాషను తమపై రుద్దవద్దని గతంలో కూడా స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. తాజాగా సీఆర్‌పీఎఫ్ పరీక్షలకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. ఈ విషయమై అమిత్ షాకు లేఖ రాశాడు