కేరళ విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ లభ్యం

By telugu news teamFirst Published Aug 8, 2020, 1:52 PM IST
Highlights

తద్వారా ప్రమాదం తర్వాత తమ ప్రాణాలు పోయినా... వాస్తవమేంటో ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో అలా చేస్తారు. నిన్నటి విమాన ప్రమాదంలో కొందరు ప్రయాణికులతోపాటూ... పైలట్, కోపైలట్ కూడా చనిపోయినట్లు తెలిసింది.


కేరళ లో గత రాత్రి ఎయిర్ ఇండియా విమానం ఒకటి కుప్పకూలిన సంగతి తెలిసిందే. దాదాపు విమానం సేఫ్ గా ల్యాండ్ అవుతుందనుకునేలోపు ప్రమాదం జరిగింది. రన్ వే పై జారి విమానం రెండు ముక్కలైంది. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. ఈ విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైందని అధికారులు తెలిపారు. బ్లాక్ బాక్స్ లభిస్తే.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయం స్పష్టంగా అర్థమౌతుంది.

డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR)... ఈ రెండూ కీలకమైన సమాచారాన్ని స్టోర్ చేస్తాయి. DFDR అనేది విమానం ఎలా వెళ్లింది, ఏం జరిగిందో చెబుతుంది. CVR అనేది పైలట్లు ఏం మాట్లాడారు, ఏమనుకున్నారు, ప్రయాణికులకు ఏం చెప్పారు వంటి అన్ని మాటల్నీ రికార్డ్ చేసి ఉంచుతుంది. అందుకు తగ్గట్టుగానే పైలట్లు కూడా... ప్రమాదం జరిగే సమయంలో... ఏం జరుగుతుందో ప్రతీదీ CVRలో రికార్డ్ అయ్యేలా అరుస్తారు. 

తద్వారా ప్రమాదం తర్వాత తమ ప్రాణాలు పోయినా... వాస్తవమేంటో ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో అలా చేస్తారు. నిన్నటి విమాన ప్రమాదంలో కొందరు ప్రయాణికులతోపాటూ... పైలట్, కోపైలట్ కూడా చనిపోయినట్లు తెలిసింది. అందువల్ల ప్రమాదం ఎలా జరిగిందో తెలియడానికి DFDR, CVR కీలకంగా మారాయి.

బ్లాక్‌బాక్స్‌లోని డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా‌ రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)లలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించనున్నారు. దీని ద్వారా.. విమానం ఎత్తు, స్థితి, వేగానికి సంబంధించిన వివరాలతోపాటు ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు కూడా లభించనున్నాయి.

ఇదిలా ఉండగా.. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ దీపక్ వసంత్ సాథే తల్లి మాట్లాడుతూ.. తను ఓ గొప్ప కొడుకని, ఇతరులకు సాయం చేయడంలో ముందుండేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ ఉపాధ్యాయులు అతడిని మెచ్చుకుంటారని దీపక్ తల్లి నీలమ సాథే ఆవేదన వ్యక్తం చేశారు.

click me!