
కర్ణాటక : బీజేపీ యువనేత హత్యతో కర్ణాటకలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లాలో బిజెపి యువ మోర్చా యువనేత ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, ప్రవీణ్ స్వస్థలం సుళ్యా తాలూకా బెళ్లారపేట కేరళ సరిహద్దులో ఉంది. కాగా, ప్రవీణ్ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్చను నిర్వహిస్తున్నాడు. అయితే, మంగళవారం రాత్రి షాపు మూసేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతని మీద దాడి చేశారు. ప్రవీణ్ ను బైక్ మీద వెంటాడి మరీ చంపారు.
ఆ తరువాత రక్తపుమడుగులో పడివున్న అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రవీణ్ ను పుత్తూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రవీణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం కాస్త బిజెపి నేతలు, యువమోర్చా నాయకులకు తెలియడంతో వారు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అర్థరాత్రి రోడ్డు మీద కూర్చుని నిరసన తెలిపారు ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. యువ నాయకుడు దారుణ హత్యకు గురికావడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ప్రవీణ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.