
Prophet remarks row: మహమ్మాద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దేశంలోని ప్రతిపక్షాలు బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే, అంతర్జాతీయ సమాజం బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలతో పాటు ఏకంగా భారత్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు, ఆరోపణతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాద సంస్థలు సైతం భారత్ ను హెచ్చరిస్తున్నాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ముంబయి, ఢిల్లీలలో ఆత్మాహుతి దాడులు చేస్తామని అల్-ఖైదా హెచ్చరించింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ వివాదంపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అల్‌ఖైదా బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే కాషాయ పార్టీ బాధ్యత వహిస్తుందని అన్నారు. "దేశంలో అంతా బాగానే ఉంది కానీ రెండు మతాల మధ్య గొడవలు జరగాలని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు. దేశంలో ఏదైనా జరిగితే దానికి బీజేపీదే బాధ్యత.. మా పని మేం చేస్తాం కానీ వీటన్నింటి వెనుక ఉన్న వారిని ఎప్పుడు పట్టించుకుంటారు. ?" అని సంజయ్ రౌత్ అన్నారు. దేశంలో బీజేపీ మత ఘర్షణలను ప్రేరేపిస్తోందని ఆరోపించారు.
ప్రవక్త మొహమ్మద్‌పై బిజెపి నాయకుల వ్యాఖ్యల కారణంగా కొనసాగుతున్న గొడవల మధ్య భారత్ లో .. అల్-ఖైదా (AQIS) తీవ్రవాద సంస్థ (AQIS) "మా ప్రవక్త గౌరవం కోసం పోరాడటానికి" పైన పేర్కొన్న ప్రదేశాలలో ఆత్మాహుతి దాడులు చేస్తాం. ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో తమ అంతం కోసం కాషాయ మూకలు ఎదురుచూడాలి. వారు తమ ఇళ్లలో లేదా వారి బలవర్థకమైన ఆర్మీ కంటోన్మెంట్లలో ఆశ్రయం పొందినాసరే" అంటూ అల్‌ఖైదా హెచ్చరించింది. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అల్‌ఖైదా హెచ్చరికల ముప్పు నేపథ్యంలో ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లు అప్రమత్తంగా ఉన్నాయని, విమానాశ్రయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లు మరియు మార్కెట్ ప్రాంతాల వంటి నిర్దిష్ట ప్రదేశాలలో ప్రత్యేక నిఘాతో ఉన్నాయని ANI నివేదించింది.
కాగా, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఓ టీవీ చర్చలో ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాగా ఢిల్లీ బీజేపీ నేత నవీన్ జిందాల్ ప్రవక్తపై ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యను పోస్ట్ చేశారు. గల్ఫ్ దేశాల నుండి భారీ నిరసనల మధ్య, బీజేపీ జూన్ 5 న వారి వివాదాస్పద ప్రకటనల కారణంగా ఇద్దరు నేతలను సస్పెండ్ చేసింది. తమ నాయకులను సస్పెండ్ చేయడానికి ముందు, బీజేపీ ఒక ప్రకటనలో తాము అన్ని మతాలను గౌరవిస్తామనీ, ఏదైనా మతపరమైన వ్యక్తులను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొంది.
ఇదిలావుండగా, మహ్మద్ ప్రవక్తపై వారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నాయకులిద్దరిని అరెస్టు చేయాలని మమతా బెనర్జీ అన్నారు. "కొందరు వినాశకరమైన బీజేపీ నాయకుల ఇటీవలి హేయమైన మరియు దారుణమైన ద్వేషపూరిత ప్రసంగ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను.. బీజేపీ తీరుతో హింస వ్యాప్తి చెందడమే కాకుండా దేశ విభజన దారీతీసేలా.. శాంతికి విఘాతం కలిగిస్తుంది" అని మమతా బెనర్జీ అన్నారు.