ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్‌ని బీజేపీ ఎంపిక చేసింది. దీంతో విష్ణుదేవ్ ఎవరు, రమణ్‌సింగ్‌ను సైతం పక్కకుపెట్టి ఆయనకు సీఎంగా ఎందుకు అవకాశం కల్పించారన్నది చర్చనీయాంశంగా మారింది.
అనేక తర్జన భర్జనలు, సుదీర్ఘ కసరత్తు అనంతరం ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్‌ని బీజేపీ ఎంపిక చేసింది. ఇవాళ జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను బీజేపీఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో విష్ణుదేవ్ ఎవరు, రమణ్‌సింగ్‌ను సైతం పక్కకుపెట్టి ఆయనకు సీఎంగా ఎందుకు అవకాశం కల్పించారన్నది చర్చనీయాంశంగా మారింది. జష్పూర్ జిల్లాలోని కుంకూరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విష్ణుదేవ్ సాయ్ విజయం సాధించారు. నాలుగు సార్లు ఎంపీగా , కేంద్ర మంత్రిగానూ సేవలందించారు. నాలుగు దశాబ్ధాలుగా బీజేపీనే అంటిపెట్టుకుని పార్టీకి విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు .
2020 నుంచి 2022 వరకు ఛత్తీస్‌గఢ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సాయ్ పనిచేశారు. 1999, 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌గఢ్ నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జాష్ఫూర్ జిల్లా జార్ఖండ్, ఒడిశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అజిత్ జోగి తొలి ఆదివాసీ సీఎంగా రికార్డుల్లోకెక్కారు. ఇప్పుడు విష్ణుదేవ్ ముఖ్యమంత్రి కావడంతో దశాబ్ధాల నిరీక్షణ తర్వాత మరో గిరిజనుడికి రాష్ట్ర పాలనా పగ్గాలు దక్కినట్లయ్యింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ , మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కుల సమీకరణాలను అంచనా వేసిన కమలనాథులు ఓబీసీలు, గిరిజనులు, ఆదివాసీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విష్ణుదేవ్‌ను ఎంపిక చేసి వుంటారని విశ్లేషకులు అంటున్నారు. సహజంగానే ఛత్తీస్‌గఢ్ దేశంలోనే అత్యధిక ఆదివాసీ జనాభాను కలిగివుంది. జార్ఖండ్, ఒడిషాలతో సరిహద్దులు పంచుకునే జాష్పూర్ జిల్లాకు చెందిన విష్ణుదేవ్‌ను ఎంపిక చేయడం ద్వారా ఈ మూడు రాష్ట్రాల్లో వున్న గిరిజనులు, ఆదివాసీల మన్ననలు, విశ్వాసాన్ని పొందవచ్చని కమలనాథుల ఎత్తుగడగా తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌కు ఓబీసీ, ఆదివాసీ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంగా నియమించాలని గట్టి నిర్ణయానికి వచ్చిన బీజేపీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించింది. అరుణ్‌సావొ, ఓపీ చౌదరిలు బీసీ వర్గానికి చెందినవారు కాగా.. విష్ణుదేవ్ సాయ్, రేణుకా సింగ్, రాంవిచార్ నేతమ్‌లు ఆదివాసీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు అవకాశం కల్పించాలని కూడా కమలనాథులు భావించారు. కానీ సామాజిక సమీకరణాలు, ఇతర లెక్కలతో ఆయనను పక్కనపెట్టక తప్పలేదు.