రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం తీసుకురండి.. జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్‌లకు టాస్క్ అప్పగించిన బీజేపీ

Published : Jun 12, 2022, 07:05 PM IST
రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం తీసుకురండి.. జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్‌లకు టాస్క్ అప్పగించిన బీజేపీ

సారాంశం

రాష్ట్రపతి అభ్యర్థికి ఎన్‌డీఏ కూటమి, యూపీఏ కూటమి, యూపీఏయేతర పార్టీల చట్టసభ్యులు, స్వతంత్ర ఎంపీల నుంచి మద్దతు లభించడానికి సంప్రదింపులు జరపాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకోసం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ఎంచుకుంది. త్వరలోనే ఈ ఇద్దరు నేతలు వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతారు.

న్యూఢిల్లీ: ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24వ తేదీతో ముగిసిపోనుంది. ఈ గడువుకు ముందే కొత్త రాష్ట్రపతి కోసం ఎన్నిక నిర్వహించే బాధ్యత ఎలక్షన్ కమిషన్‌కు ఉంటుంది. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే వ్యూహాలు, సంప్రదింపుల్లో మునిగిపోయాయి. ప్రతిపక్షాలన్ని కలిపి ఉమ్మడిగా ఒక అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకోసం పార్టీలతో సంప్రదింపులు జరపడానికి నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఇదే తరుణంలో బీజేపీ కూడా రంగంలోకి దిగింది.

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఏకాభిప్రాయం తీసుకురావడానికి సంప్రదింపులు జరపాలని బీజేపీ పార్టీ నిర్ణయించుకుంది. ఈ బాధ్యతను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు పార్టీ అప్పగించింది. రాష్ట్రపతి అభ్యర్థిని మద్దతు తెలుపడానికి స్వతంత్ర ఎంపీలు, ఎన్‌డీఏ, యూపీఏ, యూపీఏయేతర పార్టీల నేతలనూ అంగీకరించేలా చర్చలు జరపాలని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. వీరు త్వరలోనే సంప్రదింపులు మొదలు పెడతారని తెలిపింది.

రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 29వ తేదీ వరకు నామినేషన్ వేయవచ్చు. కాగా, ప్రెసిడెన్షియల్ ఎన్నికకు జూలై 18న పోలింగ్ జరుగుతుంది. ఈ ఓట్ల కౌంటింగ్ 21వ తేదీన ఉంటుంది.

రాష్ట్రపతిని ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఎన్నుకుంటారు. అంటే.. రాష్ట్రపతి ఎన్నికలో ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. అయితే, ఈ ఎన్నికలో నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటు వేసే అర్హత ఉండదు.

రామ్‌నాథ్ కోవింద్ 2017లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం