
Karnataka: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, మరో బీజేపీ నాయకుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతర్జాతీయ సమాజం భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలాగే, దేశంలోని ముస్లిం వర్గాలు నూపుర్ శర్మను అరెస్టు చేయాలనీ, ఆమెకు ఉరిశిక్ష విధించాలంటూ నిరసనలకు దిగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ అంశంపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నూపుర్ శర్మ దిష్టిబొమ్మను ఫోర్ట్ రోడ్‌లోని మసీదు సమీపంలో బహిరంగంగా ఉరితీసే విధంగా విద్యుత్ తీగకు వేలాడదీసినందుకు ముగ్గురు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమస్య ప్రజల ఆగ్రహాన్ని ప్రేరేపించడంతో, నగర మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు పోలీసులు దానిని త్వరగా తొలగించారని వారు తెలిపారు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రవక్త మొహమ్మద్‌పై చేసిన ఆరోపణపై కొన్ని ముస్లిం దేశాల నుండి నిరసనలు వెల్లువెత్తడంతో బీజేపీ జూన్ 5న నూపుర్ శర్మను సస్పెండ్ చేసింది. అలాగే, ఢిల్లీ యూనిట్ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను బహిష్కరించింది. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమెకు ప్రాణహాని ఉందని ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఢిల్లీ పోలీసులు శర్మ మరియు ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు. తనకు వస్తున్న వేధింపులు, బెదిరింపుల కారణంగా భద్రత కల్పించాలని పోలీసులను అభ్యర్థించింది.
మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై నూపుర్ శర్మకు నోటీసు
ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు ముంబై పోలీసులు నోటీసు పంపారు. జూన్ 25న వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు శర్మ ముంబై పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. “ముంబయి పోలీసులు నోటీసు జారీ చేసారు. ఆమె పైడోనీ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావలసిందిగా అడిగారు” అని పోలీసు వర్గాలు తెలిపాయి. రజా అకాడమీ ఫిర్యాదు మేరకు పైడోనీ పోలీస్ స్టేషన్ శర్మపై భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని ఆ వర్గాలు తెలిపాయి.
ఇదిలావుండగా, ప్రవక్త మొహమ్మద్‌పై సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా శుక్రవారం నాడు జరిగిన హింసాకాండకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటివరకు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు చెందిన 300 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు. ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. "రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల నుండి 304 మందిని అరెస్టు చేశామని, దీనికి సంబంధించి తొమ్మిది జిల్లాల్లో 13 కేసులు నమోదయ్యాయి" అని తెలిపారు.