
న్యూఢిల్లీ: బీజేపీ విజయవంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఒడిశా నుంచి గిరిజన నేత ద్రౌపది ముర్మును ఎంచుకోవడం ద్వారా ఎన్డీయే దాదాపు తమ విజయాన్ని ఖరారు చేసుకున్నారు. అయితే, తదుపరిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంచుకోవడానికి కసరత్తులు చేస్తున్నది. ఇందుకోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు శనివారం సమావేశం కాబోతున్నది. బీజేపీలో అత్యున్నత నిర్ణయాధికారాలు ఈ పార్లమెంటరీ బోర్డుకే ఉంటుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ షింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు ఉంటారు.
ఎన్డీయే ఎంచుకున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం దాదాపుగా ఖరారైనట్టే. ఎందుకంటే.. ఎన్డీయేకు మెజార్టీ బలం, మద్దతు ఉన్నది. అలాగే, బీజేపీ ఎంచుకునే ఉపరాష్ట్రపతి విజయం కూడా లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత కూడా వారి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాలు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఇవ్వడానికి తమ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థిపై ప్రతిపక్షాలతోనూ చర్చలు జరుపనుండటం కీలకంగా మారనుంది.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్లు ఈ నెల 19వ తేదీలోపు వేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక ఆగస్టు 6వ తేదీన ఉన్నది. ఈ ఎన్నికలో గెలిచిన అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేస్తారు. ఆయనే రాజ్యసభ చైర్మన్‌గానూ వ్యవహరిస్తారు.
ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగుస్తుంది. అంతకు ముందే కొత్త రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక పూర్తయ్యే అవకాశం ఉన్నది.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక తీరును ఆధారంగా తీసు కుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఉత్తర భారతానికి చెందిన ఓబీసీ లేదా అప్పర్ క్యాస్ట్ నేతను ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.