
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని గద్దె దింపడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్, టీఎంపీ, ఆప్, డీఎంకే.. తదితర పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన ఈ కూటమి సభ్యులు.. మరోమారు ముంబైలో సమావేశం అయ్యేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థి అని చెబుతుండటం సంచలనంగా మారింది.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. తాజాగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని అన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి పదవికి ముందుంటారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి వస్తున్న ఈ వ్యాఖ్యల బీజేపీ స్పందించింది. ఇండియాలో మిగిలిన నాయకుల పరిస్థితేమిటని ప్రశ్నించింది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్ల.. ఎక్స్(ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ను షేర్ చేశారు. ‘‘గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ చాలా తెలివిగా..ముంబై సమావేశానికి ముందు రాహుల్ గాంధీని కూటమికి ప్రధాన ముఖంగా ఉంచింది. రాహుల్ కుటుంబం సమ్మతితో భూపేష్ బఘెల్, అశోక్ గెహ్లాట్ ఇద్దరూ ఈ విషయాన్ని తెలిపారు. మరి అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్ మొదలైన ఇతర ఆశావహులను ఇది ఎక్కడ వదిలివేస్తుంది?
రాహుల్‌ను మళ్లీ ప్రొజెక్ట్ చేయకూడదని ఆప్ చెప్పినా కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని పదవి కోసం ప్రచారం చేయాల్సి వస్తుందని ఆప్, టీఎంసీలు ఎప్పుడూ ఊహించలేదు. ఇది తప్పు. 2024లో ప్రధానమంత్రి పదవి ఖాళీ లేనప్పటికీ.. ఇతరులపై రాహుల్ అంచనాలు మమత, శరద్ పవార్, నితీష్, అరవింద్ కేజ్రీవాల్ కంటే రాహుల్‌కే కాంగ్రెస్ ఎక్కువ విలువనిస్తాయనే వాస్తవాన్ని చాలా చక్కగా తేల్చింది. మమత, శరద్ పవార్, నితీష్, కేజ్రీవాల్.. వీరంతా సీఎంలుగా పనిచేసిన లేదా పనిచేస్తున్నారు!’’ అని షెహజాద్ పూనావల్ల పేర్కొన్నారు.