
రేప్ కేసును వెనక్కి తీసుకోలేదనే కారణంతో బాధితురాలి సోదరుడిని దారుణంగా దుండగులు హత్య చేశారు. అలాగే ఆమె తల్లిపై కూడా దాడి చేశారు. అనంతరం వివస్త్రను చేసి రాక్షసానందం పొందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
పోలీసులు, ‘హిందుస్థాన్ టైమ్స్’ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా బరోడియా నౌనాగిర్ గ్రామానికి చెందిన ఓ దళిత యువతిపై విక్రమ్ సింగ్ (28) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అతడితో పాటు ఎనిమిది మంది కుటుంబ సభ్యులపై 2019 లో లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఇక అప్పటి నుంచి ఆ కేసును వెనక్కి తీసుకోవాలని నిందితుడు, అతడి కుటుంబం ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఈ క్రమంలోనే గత గురువారం బాధితురాలి ఇంటికి విక్రమ్ సింగ్ వెళ్లాడు. కేసు వెనక్కి తీసుకోవాలని బాధితురాలితో గొడవకు దిగాడు. కొంత సమయంలోనే ఆ గొడవ తీవ్ర వాగ్వాదంగా మారింది. ఈ క్రమంలో బాధితురాలి 20 ఏళ్ల సోదరుడు అడ్డురావడంతో అతడిని దారుణంగా హతమార్చాడు. అనంతరం తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, బాధితురాలిపై, ఆమె తల్లిపై దాడి చేశాడని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (సాగర్) లోకేశ్ సిన్హా తెలిపారు. నిందితులు బాధితురాలి తల్లిని కూడా వివస్త్రను చేశారని ఖురై పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి నితిన్ పాల్ చెప్పారు.
కాగా.. బాధితురాలి సోదరుడిని బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు. అతడి తల్లి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘనటపై బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ ఆర్ సీ పాండే మాట్లాడుతూ.. మహిళ చేతికి ఫ్రాక్చర్ అయిందని, స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం తొమ్మిది మంది నిందితులపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 353 (లైంగిక వేధింపులు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) సెక్షన్లతో పాటు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులందరినీ అరెస్టు చేశారు.
అయితే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు మృతుడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. నిందితుల ఇంటిని కూల్చివేయాలని వారు అధికారులను డిమాండ్ చేశారు. అనంతరం సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. దీంతో సాయంత్రం కుటుంబ సభ్యులు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు.