
మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) నాయకత్వంలో ఆ పార్టీ ముందుకు సాగుతుంది. యూపీలో విస్తృతంగా పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ.. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. మహిళ భద్రతను ప్రధానంగా ప్రస్తావిస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మంగళవారం బరేలిలో Ladki Hoon, Lad Sakti Hoon (నేను అమ్మాయిని, నేను పోరాడగలను) పేరుతో నిర్వహించిన మారథాన్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. మారథాన్‌లో పెద్ద ఎత్తున బాలికలు పాల్గొన్నారు. అయితే ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట లాంటి పరిస్థితుల కారణంగా పలువురు బాలికలు గాయపడ్డారు. అయితే వాలంటీర్లు సకాలంలో స్పందించడంతో భారీ ముప్పు తప్పింది. ఇందుకు సంబంధించి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఇలా జరగడం వెనక ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కుట్ర ఉందని కాంగ్రెస నాయకులు ఆరోపించారు. తొక్కిసలాటలో కొందరు బాలికలు గాయపడినట్టుగా వారు తెలిపారు. తాము మారథాన్ నిర్వహిస్తున్నట్టుగా జిల్లా యంత్రాగానికి తెలుసునని.. తమకు వారు సహకరించలేదని చెప్పారు.
కాంగ్రెస్ ర్యాలీలో తొక్కిసలాట జరగడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికల జీవితాలను ఎందుకు పణంగా పెడుతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చా (BJP Mahila Morcha).. ట్విట్టర్ వేదికగా ప్రియాంక గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న మారథాన్‌లో బాలికలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించింది.
‘ఝాన్సీ (మారథాన్)లో బాలికలను కొట్టారు. లక్నో (మారథాన్)లో పాల్గొన్నవారిని ఆకలితో ఉంచారు. బరేలీలో అమ్మాయిలు గాయపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని బీజేపీ మహిళా మోర్చా ట్వీట్ చేసింది. అంతేకాకుండా.. నేను అమ్మాయిని, నేను పోరాడగలను అనే మాటలకు ఏం చెప్తారని ప్రియాంక గాంధీని బీజేపీ మహిళా మోర్చా ప్రశ్నించింది. ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులకు సిగ్గు అనిపించడం లేదా అంటూ తీవ్ర స్థాయిలో ప్రియాంకపై విరుచుకుపడింది.
మరోవైపు బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ (Priti Gandhi) కూడా ప్రియాంకపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదృష్టావశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. రాజకీయ ఆశయాలను నెరవేర్చుకోవడానికి మనుషుల జీవితాలతో ఆడుకోవడం సరైనదేనా అంటూ ప్రియాంక గాంధీని ప్రశ్నించింది.